People Facing Road Widening Problems: గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ ప్రజలకు సరికొత్త సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. గుంటూరు నుంచి పలకలూరు మీదుగా పేరేచర్లకు వెళ్లే రోడ్డుపై గుంతలతో ఏళ్ల తరబడి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ దుస్థితిపై మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు రోడ్డు నిర్మాణానికి బదులు విస్తరణ చేయాలన్న ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. పలకలూరు రోడ్డుతో పాటు నగరంలోని మరో నాలుగు రోడ్లు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామంటూ.. విస్తరణ కోసం ఇళ్లు, దుకాణాల నిర్మాణాలు తొలగించారు. నిర్మాణాలు తొలగించి నెలలు గడుస్తున్నా.. విస్తరణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఆ రోడ్ల పై చెలరేగే దుమ్ము స్థానికులకు సమస్యగా మారింది. ఇళ్ల ముందు డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం తీసిన గుంతలు.. రోడ్లపైన దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా విస్తరణ పనులు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
"రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుపై స్టోన్ డస్ట్ పోశారు. రోడ్డుపై లారీలు ఎక్కువగా తిరగటం వల్ల దుమ్ము లేస్తోంది. అది ఇళ్లలోకి మంచుపొగల వలే వచ్చి చేరుతోంది. ఈ దుమ్ము వల్ల ఇబ్బంది అవుతోంది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టి చాలా రోజులు గడుస్తున్నాయి. ఈ విస్తరణ పనుల వల్ల ఇబ్బందిగా ఉంది." - స్థానికుడు
విస్తరణ ప్రక్రియలో తాగునీటి పైపులైన్లు పాడయినా వాటి మరమ్మతులపై అధికారుల నుంచి స్పందన లేదు. డ్రైనేజీ కాలువ నిర్మాణాలు రహదారుల కంటే ఎత్తులో నిర్మిస్తున్నారని.. విస్తరణ పూర్తయిన తర్వాత రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. తాగునీటి కుళాయిల్లో కొన్నిసార్లు మురుగు నీరు వస్తోందని వాపోతున్నారు.
"అత్యుత్సాహంతో రోడ్ల విస్తరణ కోసం ఇళ్ల నిర్మాణాలను తొలగించినప్పుడు.. అంతే అత్యుత్సాహంతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి. ఒక దగ్గర రోడ్డు విస్తరణ పని అగినపుడు.. దానిని పూర్తి చేసిన తర్వాత మరోచోట మొదలు పెట్టాలి కానీ, ఒక దగ్గర పూర్తి కాకముందే మరో దగ్గర మొదలు పెట్టారు. రోడ్లపై పోసిన స్టోన్డస్ట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు." -గాదె వెంకటేశ్వరరావు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు
అధికారులు రోడ్ల విస్తరణ పనులు వేగంగా పూర్తి చేసి.. పటిష్టమైన రహదారి నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.