KODI KATTI CASE : జగన్‌పై కోడి కత్తి దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం.. అతని తల్లి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాలుగేళ్లుగా రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా నిరభ్యంతర పత్రం ఇవ్వాలని.. స్పందన కార్యక్రమంలో భాగంగా వినతిపత్రం ఇచ్చారు. తమ కొడుకు జైలులో ఉండటం వల్ల పోషణ కష్టంగా మారిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని నేరుగా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
బెయిల్ విషయంలో జాప్యమెందుకు జరుగుతుందో తెలియట్లేదని కోడికత్తి నిందితుడి సోదరుడు సుబ్బరాజు తెలిపారు. ఏడుసార్లు పిటిషన్ వేసినా బెయిల్ రాలేదని పేర్కొన్నారు. ఎన్‌వోసీ ఇవ్వాలని 'స్పందన'లో సీఎంను కోరామని వెల్లడించారు. కేసును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని కోరారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని న్యాయం చేయాలని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ కోరారు. సీఎంతో భేటీకి మరోసారి అవకాశమిస్తామని సీఎంవో తెలిపినట్లు వెల్లడించారు. మానవీయ కోణంలో బెయిల్ ఇప్పించాలని కోరారు. మరోసారి వచ్చి జగన్‌ను కలుస్తామని తెలిపారు.
"సీఎం జగన్‌ను కలవలేదు. మా అబ్బాయిని విడిపించాలని కోరేందుకు వచ్చాం. నా కొడుకును నా వద్దకు చేర్చకపోతే ఆత్మహత్యే శరణ్యం. మా అబ్బాయి జగన్‌పై దాడి చేశాడో లేదో నాకు తెలియదు. జగన్ అంటే మా కుమారుడికి పిచ్చి అభిమానం. కానీ దాడి వ్యవహారంలో మా కుమారుడు బలయ్యాడు. బెయిల్ ఇచ్చి మా కొడుకును విడిపించాలని సీఎంను కోరుతున్నా"-సావిత్రి, కోడికత్తి నిందితుడి తల్లి
ఇదీ జరిగింది : 2019లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. అక్టోబరు 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఓ యువకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
ఇవీ చదవండి: