కరోనాపై ప్రభుత్వం ఇస్తున్నవి తప్పుడు లెక్కలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం తొందరపడుతుందని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలపై ఏ మాత్రం శ్రద్ధ లేదన్న కన్నా...కరోనా విషయంలో సీఎం జగన్ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని విమర్శించారు. కరోనా టెస్టింగ్ కిట్లపై ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.
పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో కిట్ రూ.730 ప్లస్ జీఎస్టీ అని ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం రూ.640 అన్నారని గుర్తు చేశారు. కిట్ ధర రూ.1,200కు మెడ్‌టెక్‌లో తయారు చేస్తున్నట్లు తెలిపారన్నారు. మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపినట్లు గుర్తు చేశారు. టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంలో ఇంత గందరగోళం ఎందుకని కన్నా ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్‌లో రూ.337 ప్లస్ జీఎస్టీ చొప్పున దక్షిణకొరియా నుంచి కొన్నారని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. దీనిపై ట్వీట్ చేస్తే విజయసాయి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విషయాల్లో గందరగోళంపై ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డికి ఎందుకని నిలదీశారు. వచ్చే కమీషన్ పోయిందని విజయసాయిరెడ్డికి బాధగా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తనను కొన్నారని అంటారా.. తనను కొనేవాళ్లు పుట్టలేదని కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ... లాక్డౌన్: లాఠీ దెబ్బలకు వ్యక్తి మృతి