Jada Sravan about Jagan Cases: అధికార దుర్వినియోగానికి పాల్పడి సీఎం జగన్.. తనపై ఉన్న కేసులను తొలగించుకున్నారని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండటం దురదృష్టకరమన్నారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి, బాధితులను బెదిరించి దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతారా అని ప్రశ్నించారు.
ఎలక్షన్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులెన్ని.. ఎన్ని కేసులు వివిధ పోలీసుస్టేషన్లలో క్లోజ్ చేయించుకున్నారు.. ఏ విధంగా దానికి పోలీసులు సహకరించారు.. ఏ విధంగా బాధితులను భయపెట్టి కేసులను కొట్టివేయించారనేది ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 32కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి.. పోలీసు వ్యవస్థను ఉపయోగించి, బాధితులను భయపెట్టి కేసులను క్లోజ్ చేయించుకున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని భావించాలా అని ప్రశ్నించారు.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కేసులు తప్ప.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మిగతా కేసులన్ని కొట్టివేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండటం దురదృష్టకరమన్నారు. డాక్టర్ సుధాకర్, కిరణ్‌కుమార్, అబ్దుల్ సలాం, వరప్రసాద్, డాక్టర్ అనితా రాణి, అమరావతి రాజధాని కోసం తమ పొలాలను ఇచ్చి బాధపడుతున్న ఎస్సీ, ఎస్టీ రైతులపై కేసులు పెట్టి 17రోజులు పోలీసు కస్టడీలోకి తీసుకుని హింసించిన వైనం ఈ రాష్ట్రంలో కాకుండా ఇంకెక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో దళితులపై జరిగిన దాడులు బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండవన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అధికారులు సమాధానం చెప్పాలని శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
త్వరలోనే హైకోర్టుకు వెళ్తాం: ఆర్ 5 జోన్లో ఉన్న భూములన్నీ అమరావతిలో రైతులు ఇచ్చిన భూములని జడ శ్రవణ్ తెలిపారు. ఆర్5 జోన్లో ఉన్న 1700 ఎకరాల్లో భూములు ఇచ్చిన రైతుల్లో చాలా మంది నిరుపేదలు , దళిత బహుజన రైతులు ఉన్నారన్నారు. ఆ రైతులందరికి అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇప్పటివరకూ ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ ప్రాంతంలోకి వేరే వారిని తీసుకొచ్చి భూములు కేటాయింపు చేసి.. యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు కట్టించి.. అక్కడ ఓటర్ ఐడీ క్రియేట్ చేయాలనే దుర్మార్గమైన జగన్ మోహన్ రెడ్డి పన్నాగాన్ని జై భీమ్ భారత్ పార్టీ న్యాయపరంగా దానిని అడ్డుకుంటుందని తేల్చిచెప్పారు. దీనిపై త్వరలో హైకోర్టులో కూడా కేసులు వేయబోతున్నామన్నారు. ఆర్ 5జోన్లో ఉన్న రైతుల చేత కేసులు వేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆగమేఘాలమీద ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా కేంద్రం డబ్బులు మంజూరు చేయడాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నట్లు జడ శ్రవణ్ తెలిపారు.