Irregularities in Jagananna Vidya Kanuka : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పింది. ఏ పథకం ప్రవేశపెట్టినా వాటి నుంచి అధికార పార్టీ అస్మదీయులకు గరిష్ఠ మేలు జరిగేలా పన్నాగాలు పన్నుతున్నారు. విద్యాకానుక కిట్ల విషయంలోనూ ఇదే తేలింది. విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక స్కూల్ బ్యాగు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్కులు, ఆంగ్ల నింఘటువు కలిపి ఇచ్చారు. ఈ కిట్లకొనుగోళ్ల విషయంలో 2022-23 సంవత్సరం నివేదికలో ఆడిట్ విభాగం అనేక ఉల్లంఘనలు గుర్తించింది.
Jagananna Vidya Kanuka 2023-2024 : 2021 అక్టోబరులో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల 60 వేల మంది విద్యార్థులు ఉండేవారు. అ సంఖ్యకు 5 శాతం అధికంగా 2022-23 సంవత్సరానికి 47లక్షల 88 వేల కిట్లు కొనేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఇందులో భాగంగా 45 లక్షల 14 వేల కిట్లకు టెండర్లు పిలిచారు. ఒక్కో కిట్టు 15 వందల 65 రూపాయల చొప్పున 960 కోట్లు వ‌్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ 2022 సెప్టెంబరుకు విద్యార్థుల సంఖ్య 40 లక్షల 66 వేలకు పడిపోయింది. ఫలితంగా 4 లక్షలకుపైగా కిట్లు మిగిలిపోయాయి. దాని విలువ 70 కోట్ల 13 లక్షలు. ఆ మేర ప్రజాధనం వృథా అయిందని ఆడిట్ విభాగం తప్పుపట్టినా, అనేక ప్రశ్నలు సంధించినా అధికారుల నుంచి సమాధానంలేదు.
Illegal in Jagananna Vidya Kanuka Kits Purchases : 2023-24 విద్యా సంవత్సరానికి కొత్తగా టెండర్లు పిలిచేటప్పుడు అంతకుముందు ఏడాదిలో 4 లక్షల కిట్లు మిగిలాయనే విషయాన్నే పట్టించుకోలేదు. వాటిని ఏం చేద్దామనే ఆలోచనే చేయలేదు. ఈసారీ విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణనలోకి తీసుకోలేదు. మళ్లీ అంచనాలను పెంచి 43 లక్షల 10 వేల కిట్లకు టెండర్లు పిలిచారు. అలా ఎందుకు చేశారనే ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ నుంచి సమాధానం లేదు. ఆ తర్వాత పిల్లలు తగ్గినందున 39 లక్షల 96 వేల కిట్లే తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అసలు ఎన్ని లక్షల కిట్లను కొన్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి.
Differences in Vidya Kanuka Kits calculations : రాష్ట్రంలో గత మూడేళ్లలో విద్యార్థుల సంఖ్య కంటే 7లక్షల59 వేల 714 కిట్లు అదనంగా కొనుగోలు చేశారు. కిట్టు సరాసరిన 16 వందల రూపాయలు అనుకున్నా 121 కోట్ల 55 లక్షల రూపాయల ప్రజాధనం వృథా అయింది. నిరుడు మిగిలిన కిట్లలో నుంచి లక్షా 46 వేల బెల్టులను ఈ ఏడాది ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ ఏడాది అదనంగా ఎందుకు కొన్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. బూట్లలోనూ 69 వేల జతలు మాత్రమే మిగిలినట్లు చెప్తున్నారు. మరి మూడేళ్లలో మిగిలిన 7 లక్షల 59 వేల కిట్లలోని మిగతా బూట్లు ఏమయ్యాయంటే సమాధానం చెప్పేవారేలేరు.
ముందు కిట్లకు ఆర్డర్ ఇవ్వండి..! విద్యాకానుక కిట్ల వెనుక కాసుల గలగలలు
YSR Jagananna Vidya Kanuka to Students : గతేడాది ఒక్కో కిట్‌కు 15 వందల 65 రూపాయలు ఇచ్చారు. ఈసారి ధరను ఏకంగా 19 వందల 60 రూపాయలకు పెంచేశారు. నిరుడు ఒక బ్యాగుకు 180 రూపాయలు చెల్లించగా ఈ ఏడాది అనూహ్యంగా 272 రూపాయల చొప్పున కొన్నారు. నిరుటితో పోలిస్తే 92 రూపాయలు ఎక్కువకు కొన్నారు. సంచుల సైజు, నాణ్యత పెరిగిందని సమర్థించుకున్నారు. ఏకంగా 40 లక్షల బ్యాగులు కొనేటప్పుడు ఇంత ధర చెల్లించడంపై అనేక ఆరోపణలున్నాయి. వీటి కొనుగోలు విషయంలో గుత్తేదార్లతో ఓ కీలక ప్రజాప్రతినిధి నేరుగా బేరసారాలు సాగించారు. రివర్స్ టెండర్ జరిగిన తర్వాత వారితో మాట్లాడి ఆయనే ధర నిర్ణయించారు. బూట్లు, రెండు జతల సాక్సులు కలిపి 189 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. గతేడాది కంటే ఒక్కోదానిపై 14 రూపాయలు అదనంగా చెల్లించారు.