విద్యార్థుల్లోన్ని సృజనాత్మకతను గుర్తించేందుకు కేంద్ర సైన్స్, సాంకేతిక మంత్రిత్వశాఖ ఇన్‌స్పైర్ మనాక్ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేస్తుంది. ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆరు నుంచి పదో తరగతి చదివే వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. యూపీ పాఠశాలకు రెండు, ఉన్నత పాఠశాలకు ఐదు చొప్పున అవార్డులు మంజూరు చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌లో అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్ఛు జిల్లాస్థాయి అవార్డుకు ఎంపికైతే రూ.10 వేలు అందజేస్తారు. ఆ నగదుతో ప్రాజెక్టు తయారు చేసుకోవచ్ఛు రాష్ట్రస్థాయికి ఎంపికైతే మరో రూ.10 వేలు, జాతీయస్థాయికి ఎంపికైతే రూ.20 వేలు అందజేస్తారు. సైన్సు ఉపాధ్యాయుడి సహకారంతో ప్రాజెక్టు తయారు చేయాల్సి ఉంటుంది. సమకాలీన వర్తమాన అంశాలకు సంబంధించి సమస్య.. పరిష్కారాన్ని విద్యార్థులు చూపించాలి.
- వెయ్యి ఆలోచనలు.. 60 మంది బాల మేధావులు..:
దేశస్థాయిలో వెయ్యి ఉత్తమ ఆలోచనల్ని గుర్తించి వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వబోతుంది. వారిలో నుంచి పోటీపడి జాతీయస్థాయిలో రాణించే 60 మందిని బాల మేధావులుగా గుర్తిస్తారు. వారిని రాష్ట్రపతి భవన్ సందర్శనకు తీసుకెళ్లడంతోపాటు ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. సుకురా నాలెడ్జ్ ప్రోగ్రాం కింద జపాన్ పర్యటనకు సైతం తీసుకెళ్తారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి నిజాంపట్నం విద్యార్థి నర్రా శ్రీకృష్ణ, చిలకలూరిపేట విద్యార్థిని మెహరాజ్ జపాన్ వెళ్లి వచ్చారు.
- అదిరేటి ఆలోచనకు విద్యార్థికి కేంద్రం పేటెంట్ అందజేస్తుంది. వివిధ పరిశ్రమలు సైతం ఉపకార వేతనాలు అందజేస్తాయి.
- స్టార్టప్.. చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తారు.
- ఆరో తరగతిలో అవార్డుకు ఎంపికైతే ఉన్నత విద్యాభ్యాసనతోపాటు ఏదైనా రంగంలో స్థిరపడేవరకు కేంద్రం నుంచి ప్రోత్సాహాకాలు లభిస్తాయి.
ఇదో మంచి అవకాశం..:
2019-20 విద్యా సంవత్సరానికి జిల్లా నుంచి జిల్లాస్థాయికి 469 మంది ఎంపికయ్యారు. వీరిలో 46 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవగా ఐదుగురు ఉత్తమ ఆలోచనలతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కరోనాతో ఇంటి వద్దే విద్యార్థులు ఉన్న నేపథ్యంలో అందరి నుంచి ఆలోచనలు స్వీకరించి వాటికి పదునుపెడితే ఎక్కువ ఆలోచనలు మెరిసే అవకాశాలున్నాయి. 2020-21 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల్లో ప్రతిభావంతులదరితో ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుకు దరఖాస్తు చేయించాలని, ఇది మంచి అవకాశమని జిల్లా సైన్స్ అధికారి మధుకుమార్ ఉపాధ్యాయులకు సూచించారు.
- దరఖాస్తు చేయడం ఇలా..
కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ వెబ్‌సైట్ www.inspireawardsdst.gov.in లో పాఠశాల యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో దరఖాస్తు చేయాలి. పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్న తరుణంలో వీడియో రూపంలో ప్రాజెక్టు ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి : పాత్రికేయుడు నవీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు... ప్రధాన ముద్దాయి వైకాపా నేతే