గుంటూరు సర్వజనాస్పత్రిలో ఖరీదైన క్యాన్సర్ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కోస్తాంధ్ర ఆరోగ్యప్రదాయనిగా పేరు గాంచిన జీజీహెచ్‌లో ఇకపై పేద ప్రజలకు అధునాతన వైద్యసేవలు ఉచితంగా అందనున్నాయి. నాట్కో ఫార్మా లిమిటెడ్ ట్రస్ట్ , రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో రూ. 50 కోట్ల రూపాయలతో నిర్మించిన అధునాతన క్యాన్సర్ ఆస్పత్రిని జులైలోనే సీఎం జగన్ ప్రారంభించారు. అయితే కొవిడ్ ఉద్ధృతి తగ్గిన అనంతరం ప్రస్తుతం కీలక వైద్యసేవలు ప్రారంభమయ్యాయి.
ఏ ప్రభుత్వాస్పత్రిలో లేని విధంగా..
రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాస్పత్రిలో లేని విధంగా 150 పడకలతో సెల్లార్, జీ ప్లస్-3 అంతస్తుల్లో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. శీతలీకరణ యంత్రాలు, ఫర్నిఛర్, విద్యుత్ పరికరాలతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఆస్పత్రిలో పొందుపరిచామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు.
ఇకపై కాన్సర్ రోగుల కోసమే..
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రి రిఫరల్ ఆస్పత్రిగా ఉండేదని.. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్సకు అధునాతన సదుపాయాలతో ఆస్పత్రి లేకపోవడం రోగులకు సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు సర్వజనాస్పత్రి క్యాన్సర్ విభాగం.. ఇకపై రోగులకు అండగా నిలవనుందని ఆమె స్పష్టం చేశారు.
సామాన్యులకు అందుబాటులో..
కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకే పరిమితమైన అత్యాధునిక క్యాన్సర్ వైద్యచికిత్సలు జీజీహెచ్ ద్వారా సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. కండరాలు, నరాలు దెబ్బతినకుండా నిర్దేశిత ప్రాంతంలోనే ఖచ్చితంగా రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు రూ. 20 కోట్ల విలువైన అధునాతన యంత్రం లీనియర్ యాక్సిలేటర్‌ను జీజీహెచ్‌లో ఏర్పాటు చేశామని క్యాన్సర్ విభాగాధిపతి డా. దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
కచ్చితంగా లక్ష్యం కోసం..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పెద్ద ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే ఈ అధునాతన యంత్రం సేవలందిస్తోందన్నారు. తలలో చిన్న చిన్న క్యాన్సర్ కణితులపై రేడియోథెరపీ ఇచ్చేటప్పుడు పక్కనే సున్నితమైన నరాలు దెబ్బతిని దుష్పభావం ఏర్పడుతోందని ఆయన వివరించారు. ఇలాంటి సమస్యలకు అవకాశం ఇవ్వకుండా లీనియర్ యాక్సిలేటర్ యంత్రం ద్వారా కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు.
క్రమంగా అందుబాటులోకి..
సర్జరీ, రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి మూడు క్యాన్సర్ దశలను గుర్తించడానికి బ్రాకీ థెరపీ, సిటీ సిమ్యులేటర్ వంటి నిర్ధారణ పరీక్షలు సైతం జీజీహెచ్‌లో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో జీజీహెచ్‌లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాట్కో క్యాన్సర్ సెంటర్లో 150 బెడ్లు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 50 నుంచి 60 మంది వరకు రోగులున్నారు. క్యాన్సర్ లక్షణాలను తొందరగా గుర్తించగలిగితే.. త్వరగా చికిత్సలు అందించడంతో రోగులు కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని జీజీహెచ్ క్యాన్సర్ విభాగాధిపతి డాక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు.
ప్రభుత్వం ఓకే..
జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో అత్యాధునిక వ్యాధి నిర్ధారణ యంత్రాలను సమకూర్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. రోగుల సంఖ్య పెరుగుదల ఆధారంగా మరిన్ని సేవలను విస్తరించే అవకాశముంది.