Huge Fire Accidents in Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి ప్రమాదాలన్నీ అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయి. ప్రమాదాలు జరిగిన గోదాంలకూ అనుమతి లేదు. దెక్కన్ స్పోర్ట్స్ నైట్‌వేర్‌ది అదే పరిస్థితి. యజమాని 2006లో ఒక సెల్లారుతో జీ+4 అంతస్తులకు అనుమతి తీసుకుని, రెండు సెల్లార్లు, జీ+5 భవనాన్ని నిర్మించారు.
GHMC On Secunderabad Issue: అది కూడా నివాస సముదాయం కేటగిరీలోనే. 2008 నుంచి భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అగ్ని మాపక చర్యల్లేవ్, సెట్ బ్యాక్ నిబంధనలు పాటించలేదు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు కూడా అనుమతి లేని భవనాల్లోనే జరగడం ఆందోళనకు అద్దంపడుతోంది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రతిసారీ జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలుంటాయని అంటున్నారు.
తర్వాత ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా చేతులు దులిపేసుకుంటున్నారు. 2022 జనవరి 16న సికింద్రాబాద్ క్లబ్‌ను అగ్ని దహించింది. భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. 2022 మార్చి 23 తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలోని తుక్కు గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలుగా పనిచేసే 12 మంది బీహార్ వాసులు మృత్యువాతపడ్డారు. 2022 మే 18న బోయిగూడ పక్కనున్న భోలక్పూర్ గోదాం మంటల్లో చిక్కుకుంది.
2022 జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కే నిప్పు రాజుకుంది. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ యువత స్టేషన్‌లోని పలు రైళ్లకు నిప్పుపెట్టడం, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడం.. ఓ యువకుడు మృతి చెందడం ఘటనలు జరిగాయి. 2022 సెప్టెంబరు 12న సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం పక్కనున్న రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది.
గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్న 12 మంది మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. నగరంలో దాదాపు రెండువేల ఆసుపత్రులు, వెయ్యిపైగా వాణిజ్య వ్యాపార సంస్థలు, దుకాణాలు అగ్నినిరోధక వ్యవస్థ.. పూర్తిగా లేకుండానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ గుర్తించింది. సంబంధిత భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న విషయం బల్దియా ఆధ్యర్యంలోని విజిలెన్సు విభాగం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
అటువంటప్పుడు సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ విజిలెన్సు విభాగం నోటీసులు ఇచ్చి ఊరుకుంది. వివిధ స్థాయిల్లో వచ్చిన ఒత్తిడిలతో సంబంధిత సంస్థలు, భవనాలపై చర్యలకు ఉపక్రయమించలేదు. బల్దియా నోటీసులు ఇచ్చిన తర్వాత.. కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే అగ్నిమాపక నిరోధక వ్యవస్థను పూర్తిగా ఏర్పాటు చేసుకోగా ఇప్పటికీ వందల్లో ఆసుపత్రులు పూర్తి స్థాయి అగ్నినిరోధక వ్యవస్థలు కలిగి లేవన్నదిని సమాచారం.
క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనకు ప్రధాన కారణం స్థానిక అధికారులు లంచాలకు అలవాటు పడటమేనని తెలుస్తోంది. వచ్చిన కాడికి బొక్కేసి నిబంధనలను తుంగలే తొక్కేసి అనుమతులు ఇస్తున్నారని, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి: