Ippatam Houses demolition: గుంటూరు జిల్లా ఇప్పటం మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం.. ఓ చిన్న గ్రామం. 2వేల మంది జనాభా ఉంటారు. 600 వరకు ఇళ్లుంటాయి. ఈ ఊరికి దాదాపుగా 65 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి ఉంది. దానికి ఇరువైపులా మురుగుకాలువలనూ నిర్మించారు. మురుగు కాలువలను వదిలి గ్రామస్థులు ఇళ్లుకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇళ్లనే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారులు కూల్చేశారు. దీనికి అధికారులు చెప్పిన కారణం.. రహదారి విస్తరణ.
ఇప్పటం రావడానికి మూడు మార్గాలున్నాయి. అవి ఇరుకుగా ఉంటాయి. అందుకే పాఠశాలల బస్సులు మినహా పెద్దగా వాహనాల రాకపోకలేవీ ఉండవు. ఇరుకుగా ఉన్న రోడ్లను వదిలేసిన అధికారులు, గ్రామ నడిబొడ్డున విశాలంగా ఉన్న రహదారిని విస్తరిస్తామంటూ.. శుక్రవారం ఉదయాన్నే ఊడిపడ్డారు. వస్తూనే జేసీబీలతో పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. ఏం జరుగుతుందోజనం అర్థం చేసుకునేలోపే కూల్చివేతలు మొదలయ్యాయి. ప్రొక్లెయిన్‌తో ప్రహరీ గోడలు కూలదోశారు. మెట్లు పగలగొట్టారు. ఇళ్ల యజమానులు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. అడ్డుకున్న వారిని పోలీసులు లాగిపడేశారు.
రాజకీయ కక్ష తప్ప ఇందులో ఏమీ కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేయడమే దీనికి నిదర్శనమంటున్నారు. ఇటీవల జనసేన సభకు చోటు ఇవ్వకుండా అధికార పార్టీ అడ్డుపడుతుంటే.. తమ గ్రామంలో సభ పెట్టుకోవాలంటూ ఆహ్వానించడమే తాము చేసిన పాపమా! అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం రహదారి విస్తరణకోసం చట్టప్రకారం నోటీసులు జారీ చేశామని, గడువు తీరాకే ఆక్రమణలు తొలగించామని అంటున్నారు.
ఇప్పటంలో గడచిన కొన్నిరోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. జనసేన సభకు అవకాశం కల్పించినందుకు పవన్ కల్యాణ్ ఈ గ్రామాభివృద్ధికి 50 లక్షలు విరాళం ప్రకటించారు. వాటితో పనులు చేపట్టాలని సంకల్పించగా ఆ డబ్బును సీఆర్డీఏకి జమ చేయాలంటూ అధికారులు అడ్డుపడ్డారు. దీనిపై ఇటీవలే జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఆరోజు విద్యుత్తు సరఫరా నిలిపేశారు. కొందరు పవన్ ఫ్లెక్సీలు చించేసి.. ఫ్లెక్సీలపై పేడ చల్లారు. ఈ నేపథ్యంలోనే కక్షగట్టి జనసేన సభకు భూములిచ్చిన వారి ఇళ్లు కూల్చివేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామన్న పవన్ కల్యాణ్ నేడు ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారు.
ఇవీ చదవండి: