వరదల కారణంగా తూర్పు, గోదావరి జిల్లాల్లో 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని హోంమంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అధికారులు, సిబ్బందిని ప్రభావిత జిల్లాల్లో రంగంలోకి దింపామని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో సుమారు 17,632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నామని హోంమంత్రి వివరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇంత చేస్తున్నా... సహాయక చర్యలు అందటం లేదంటూ... చంద్రబాబు విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం అమలు చేయలేదన్న హోంమంత్రి... అందువల్లే వైకాపాకు భారీ ఆధిక్యం లభించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై అసత్య ప్రచారం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం కేవలం 2నెలల్లోనే లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తోందని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇస్తామన్న తెదేపా... ఇప్పుడు ఓపిక పట్టలేకపోతోందని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుగుతోందని... త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇసుకను ప్రభుత్వమే లబ్ధిదారులకు అందజేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తామని ఉద్ఘాటించారు.