MINISTER RAJINI REVIEW ON MEDICAL COLLEGES : వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. రాజమహేంద్రవరం, నంద్యాల, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నంలోని వైద్య కళాశాలల నిర్మాణంలో జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) తనిఖీ బృందం గుర్తించిన లోపాలు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి శుక్రవారం ఆమె సమీక్షించారు.
తరగతుల ప్రారంభానికి తగ్గట్టు నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) అధికారులదేనని అన్నారు. కళాశాలల్లో 30 శాతం లోపు సిబ్బంది నియామకాలను సత్వరం చేపట్టాలన్నారు. ఫర్నిచర్, పరికరాల కొనుగోలు చర్యలు ముమ్మరం చేయాలని, వీటికి నిధుల కొరత లేదని తెలిపారు.
పనుల్లో జాప్యంపై ప్రశ్నించిన ఎన్‌ఎంసీ: ఐదు వైద్య కళాశాలల పనుల్లో ఆశించినమేర పురోగతి లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తనిఖీ బృందాలు ప్రశ్నించాయి. సీనియర్ రెసిడెంట్ల కొరతతోపాటు నిర్మాణాల్లో పురోగతి లేకపోవడంపై తనిఖీ బృందాలు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరాయి. పరికరాలు, ఫర్నిచర్ లేకపోవడంపై ప్రశ్నించాయి. ముఖ్యంగా ఐదు జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చాలన్న నిర్ణయం తీసుకునేందుకే విలువైన సమయం వృథా అయింది. దీనివల్ల ఎన్‌ఎంసీ బృందం తొలి విడత తనిఖీలనాటికి నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి తలెత్తింది.
విజయనగరం, రాజమహేంద్రవరం వైద్య కళాశాలల భవనాలు, వసతి గృహాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. మచిలీపట్నం కళాశాల వసతిగృహం, లైబ్రరీ, స్టాఫ్‌రూమ్‌లు, క్వార్టర్స్ నిర్మాణ దశలోనే ఉన్నాయి. నంద్యాల కళాశాలలో ప్రీ-పారా క్లినికల్ డిపార్టుమెంట్లు లేవు. మిగిలిన వాటితో పోలిస్తే ఏలూరు కళాశాల నిర్మాణం బాగా వెనకబడి ఉంది. మరోవైపు ఈ కళాశాలల్లో 208 పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంది. వీటి కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఎన్‌ఎంసీ బృందాలు గుర్తించిన లోపాలను సరిచేస్తూ నిర్మాణాలను మార్చి నాటికి పూర్తి చేయాలని గుత్తేదారులను వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది.
ఇవీ చదవండి: