AGRICULTURAL BUILDING : అవి ప్రజల సొమ్ముతో నిర్మించిన సౌధాలు.! వ్యవసాయ విస్తరణ,.. అనుబంధ రంగాల పరిశోధన కోసం కట్టిన కట్టాడాలు.! కానీ..ఇప్పుడవి అలంకార ప్రాయంగా మిగిలాయి. ప్రభుత్వం.. సిబ్బందిని నియమించక, పరికరాలు సమకూర్చక ప్రారంభానికి ముందే పనికి రాకుండా పోయేలా ఉన్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత.. హైదరాబాద్ నుంచి అమరావతికి శాఖలను తరలించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం.. వ్యవసాయ, అనుబంధ రంగాల విభాగాలను గుంటూరులోని మంగళగిరి పరిసరాల్లో.. ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే అమరావతిలో..పెద్ద భవన సముదాన్ని నిర్మించింది.
ఇందులో రాష్ట్ర పురుగు మందుల కోడింగ్ కేంద్రం, రాష్ట్ర జీవ క్రిమి సంహారకాల పరీక్షా కేంద్రం, ఎరువుల పరీక్షా కేంద్రం, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ ప్రయోగశాల, నేషనల్ రిఫరల్ ల్యాబరేటరీ, రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య విస్తరణ, శిక్షణాసంస్థ వంటి విభాగాల ఏర్పాటు కోసం.. 2018లో శంకుస్థాపన చేశారు. భవనాలనూ నిర్మించారు. ప్రభుత్వం మారడంతో.. ఈ భవనాలు అనాథలా మిగిలిపోయాయి.
గుత్తేదారు భవనాలు నిర్మించినప్పటికీ పరికరాలు ఏర్పాటు చేయలేదు. పరిశోధన, విస్తరణ అంశాలకు సంబంధించి పరికరాలే కీలకం. వీటికి సంబంధించిన సిబ్బంది .. ప్రస్తుతం గుంటూరు, మంగళగిరి వ్యవసాయ కార్యాలయాల్లో.. పనిచేస్తున్నారు. వారిని కొత్త భవనాల్లోకి తరలించలేదు. ప్రైవేటుగా ఓ వాచ్ మెన్‌ను పెట్టడం మినహా వీటి పర్యవేక్షణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా దుండగులు.. తమకు తోచినవి పీక్కుని వెళ్తున్నారు. ఇటీవల విద్యుత్ పరికరాలను.. గుర్తుతెలియని వ్యక్తులు పట్టుకుపోయారు.
కీలకమైన ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే.. విత్తన అభివృద్ధి, ఎరువులు, పురుగుమందుల కల్తీని నిర్ధారించే అవకాశముంది. రైతులకు.. చేదోడు వాదోడుగా నిలిచే కీలక ప్రయోజనాలున్న ఈ పరిశోధన కేంద్రాల్ని తక్షణం కార్యరూపంలోకి తేవాలని..రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: