కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను పొట్టనపెట్టుకుంటున్న మహమ్మారి.. చిన్నారుల్ని అనాథలుగా మార్చేస్తోంది. నా అన్నవారు లేక పిల్లలు బిక్కుబిక్కుమంటూ భయంగా గడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సోకి మరణించిన వారి పిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం.. అనాథలుగా మారిన ఆ చిన్నారులకు రూ.10లక్షలు, తల్లిదండ్రుల్లో ఒకరు మరణిస్తే నెలకు రూ.500 ఉపకార వేతనం ఇవ్వనుంది.
అధికారిక జాబితా ప్రకారం అనాథలుగా మారిన పిల్లల వివరాలు
వివరాలు | ఏపీ | తెలంగాణ |
అనాథలు | 103 | 123 |
ఒకరిని కోల్పోయిన వారు | 13 | 0 |
మొత్తం | 116 | 123 |
ఒకరిని కోల్పోయిన పిల్లలకు నెలకు రూ. 500 ఉపకారవేతనం
కొవిడ్ బారినపడి తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు నెలకు రూ. 500 ఉపకారవేతనం వచ్చే అవకాశం ఉందని, దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల్ని జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని ఐసీడీఎస్ ఈమని ప్రాజెక్టు సీడీపీవో ఎస్‌వీఎస్ శైలజ తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి మే నెలలోపు కరోనాతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథలుగా మారిన పిల్లలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారున్నా స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అందులో కొందరిని ఎంపికచేసి ఉపకార వేతనం అందజేస్తామని చెప్పారు.
కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పటికే ఇంటికి ఇస్తున్న రేషన్‌ను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు చెప్పారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద బాలింతలు, గర్భిణులు, ఆరు నెలల నుంచి 36 నెలల పిల్లలకు రేషన్, పాలు, గుడ్లు అందజేస్తారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉంటాయన్నారు. కేంద్రాలకు వచ్చే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
బి12తో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం అందజేత
ఈ నెల నుంచి ఐరన్, ఫ్లోరిక్ ఆమ్లం, విటమిన్ బి12తో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్‌వాడీల్లో ఇస్తారని, దీని వల్ల రక్తహీనత ఉండే వారికి ఎంతోమేలు చేకూరి, ఆరోగ్య వికాసం ఉంటుందన్నారు. ఈమని ప్రాజెక్టు పరిధిలో గర్భిణులు 788 మంది, బాలింతలు 626, మూడేళ్ల లోపు పిల్లలు 2946, మూడు నుంచి ఐదేళ్ల లోపు వాళ్లు 2241 మంది లబ్ధి పొందుతున్నారన్నారు.
చిన్నారులను దత్తత తీసుకున్న కడప ఎస్పీ అన్బురాజన్
కరోనా వైరస్‌తో కన్నవారిని కోల్పోయిన ఐదుగురు చిన్నారులను.. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ దత్తత తీసుకున్నారు. చిన్నారుల విద్య, సంరక్షణ అంతా.. జిల్లా పోలీసు శాఖ చూసుకుంటుందని ఆయన తెలిపారు. చిన్నారులు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకునేలా.. వారిని సిద్ధం చేసేలా ప్రణాళిక చేసినట్లు చెప్పారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన పిల్లలు ఆవేదన చెందవద్దని.. వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జ్యుడీషియల్ ప్రివ్యూకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ ప్రతిపాదనలు