గుంటూరు నగరంలోని జాలయ్య మున్సిపల్ కాంప్లెక్స్ కూల్చివేతకు అధికారులు చేసిన ప్రయత్నాల్ని వ్యాపారులు అడ్డుకున్నారు. 1948లో నిర్మించిన ఈ భవనంలో 60కి పైగా దుకాణాలున్నాయి. భవనం నిర్మించి 70ఏళ్లు దాటిపోవటంతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని.. కాంప్లెక్స్‌ను ఖాళీ చేయాలని వ్యాపారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించకపోవటంతో నగరపాలక సంస్థ అధికారులు ఇవాళ జేసీబీలతో వచ్చి దుకాణాల్ని కూల్చేందుకు యత్నించారు.
దీంతో వ్యాపారులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. వ్యాపారుల ఆందోళనకు తెదేపా, కాంగ్రెస్, సీపీఐ నేతలు మద్దతు పలికారు. పోలీసులు, అధికారులు వచ్చి వ్యాపారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ప్రస్తుతానికి కూల్చివేత కార్యక్రమాన్ని ఆపిన అధికారులు వ్యాపారులను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే కూల్చివేతకు ఒక్క రోజు ముందున అధికారులు నోటీసులు ఇచ్చారని వ్యాపారులు చెబుతున్నారు. తమతో సంప్రదించలేదని, కనీసం దుకాణాల్లోని వస్తువులు తీసుకునే అవకాశం ఇవ్వకుండా కూల్చివేతకు రావటాన్ని తప్పుబట్టారు.
ఇదీ చదవండి: గుంటూరు మంగళదాస్ నగర్‌లో వ్యక్తి హత్య