Buggana on Budget: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొంటూనే... రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం నిరాశ కలిగించిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, మౌలిక వసతులు, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తదితరాలను ప్రస్తావించకపోవడం రాష్ట్రానికి నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ‘మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర చాలా కీలకమని అన్నారు. వనరుల లభ్యత తక్కువగా ఉండటం, రుణాలు తీసుకోవడంపై ఉండే పరిమితుల వల్ల రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. కేటాయింపులు పెంచడం, రుణ పరిమితి పెంచేందుకు చర్యలు చేపట్టి ఉంటే రాష్ట్రాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉండేదని అన్నారు.
నరేగా, ఎరువులు, ఆహార రాయితీలు బాగా తగ్గాయి. జల జీవన్ మిషన్, జాతీయ విద్య మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు పెంచారని అన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు మరింత పెంచి ఉంటే బాగుండేదని తెలిపారు. జాతీయ రహదారులకు కేటాయింపులు రెట్టింపు చేయడం ముదావహమని అన్నారు. రాష్ట్రాల్లో మూల ధన వ్యయంగా వెచ్చించేందుకు రాష్ట్రాలకు కేంద్ర సాయంగా ఇచ్చే కేటాయింపులను రూ.లక్ష కోట్లకు పెంచడం ఆనందదాయకం...’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ‘జీడీపీ పెరగడం మంచి పరిణామం అని అన్నారు. ద్రవ్యలోటు, రెవెన్యూలోటు తగ్గడం సంతోషదాయకంమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను రాబడికి జీఎస్‌టీ బాగా తోడ్పడిందని అన్నారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, జలమార్గాలు, సరకు రవాణా, మౌలిక సదుపాయాల రంగాలు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందేలా జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Union budget 2022: నవ భారత్ కోసం 'బూస్టర్ డోస్' బడ్జెట్!