యూ -1 జోన్ ఎత్తివేయాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు గత 38 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. యూ-1 జోన్‌పై అభ్యంతరాలు తెలపాలని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు తాడేపల్లిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో పాల్గొన్న రైతులు జోన్ ఎత్తివేయాలంటూ ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానం చేశారు. తమ అభ్యంతరాలను రైతులు నగరపాలక సంస్థ అధికారులకు అందించారు. జోన్ ఎత్తేస్తున్నట్లు జీవో వచ్చేంత వరకు నిరసన శిబిరాన్ని కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు.
యూ -1 జోన్ అంటే: గత ప్రభుత్వ హయంలో అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్‌గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్‌ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి :