Amaravathi farmers yagam: పేద ముఖ్యమంత్రిని, పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్ కి.. అమరావతి పేదలు కనిపించరా అంటూ రాజధాని మహిళ రైతులు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని తుళ్లూరు మండలం మందడంలో రైతులు సుదర్శన యాగం చేశారు. పెత్తందారు జగన్ కి అమరావతి రైతులకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొని పూజలు నిర్వహించారు. లిబియా మాజీ నేత గడాఫీకి పట్టిన గతే జగన్ కి కూడా పడుతుందని మండిపడ్డారు. అమరావతి మహిళా రైతుల కన్నీటి కడలిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఏకైక రాజధానిగా అమరావతే కొనిసాగాలంటూ రైతులు, మహిళలు తుళ్లూరు మండలం మందడంలో శ్రీలక్ష్మీ గణపతి పూజ, సుదర్శనయాగం నిర్వహించారు. సోమవారం ఆర్ 5 జోన్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అమరావతికి న్యాయం దక్కాలంటూ ఈ పూజలు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని జగన్ పై ఉమమహేశ్వరరావు నిప్పులు చెరిగారు. లిబియా మాజీ నేత గడాఫీ పట్టిన గతే జగన్ కు పడుతుందన్నారు. జగన్ ప్రభుత్వానికి ఎక్స్పైర్ డేట్ వచ్చేసిందన్నారు.
ఐదు కోట్ల మంది ప్రజలు తమ రాష్ట్ర రాజధాని ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ అమరావతి రైతుల ఉసురు, మహిళల కన్నీటిలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. - దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత
అమరావతికి ప్రజా బలంతో పాటు రైతుల సంకల్పం గొప్పది. ఆ సంకల్పానికి దైవ బలం కూడా చేకూరాలన్న ఉద్దేశంతో సుదర్శన యాగం చేపట్టాం. అమరావతే రాజధానిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వానికి ఏ మాత్రం భయపడకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోర్టులో తీర్పు అమరావతికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. - మల్లేశ్వరి, మహిళా రైతు, మందడం
నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్.. ఈ రాష్ట్రానికి ఏం చేశానని చెప్పుకొంటాడు. చంద్రబాబు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి గుండెలపై చేయి వేసుకుని ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పమనండి. రైతులకు ఇన్నాళ్ల పాటు కౌలు కూడా ఇవ్వడం లేదు. తన మాటల్లో పేదవాన్ని అని చెప్పుకొనే ముఖ్యమంత్రి అసలు పేదలు ఎవరో తెలుసుకోవాలి. పేద రైతులకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. - రాధికా, మహిళా రైతు, మందడం
పోయిన అమరావతి మళ్లీ తిరిగి సంపాదించుకోవాలని ఈ సుదర్శన యాగాన్ని చేపట్టాం. ఈ యాగం తప్పకుండా విజయవంతమవుతుంది. - వరలక్ష్మి, మహిళా రైతు, మందడం