కోటప్పకొండ తిరునాళ్లలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న విద్యుత్ ప్రభల నిర్మాణాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ప్రభలు కడితే అక్రమ కేసులు పెడతామని పోలీసులు చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు..
పార్టీలకు అతీతంగా భక్తులు ప్రభల నిర్మాణం చేయడం దశాబ్దాల కాలంగా జరుగుతోందని పత్తిపాటి పుల్లారావు అన్నారు. బందోబస్తు పెంచి పండగ సజావుగా జరిగే విధంగా చూడాలే కానీ... ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా పట్టుబడని అక్రమ మద్యం చిలకలూరిపేట నియోజకవర్గంలోనే పట్టు పడుతోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని నియమించి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా మద్దతుదారులకు పత్తిపాటి పుల్లారావు అభినందనలు తెలిపారు.
నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్యను పత్తిపాటి పుల్లారావు ఖండించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించి, నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.