బయో పురుగుమందుల పేరిట నాసిరకానివి అంటగట్టడంతో కూరగాయల తోట పాడైపోయిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. దుగ్గిరాల మండలం తాడిబోయినవారి పాలెంలో గోపాలకృష్ణ అనే రైతు 40 సెంట్లలో బీర పంట సాగు చేస్తున్నాడు. పురుగు పట్టకుండా ఉండేందుకు తెనాలిలో మందులు కొనుగోలు చేశారు. అయితే రైతు అడిగినవి కాకుండా.. బయో మందులు బాగా పని చేస్తాయని దుకాణం వాళ్లు వేరే వాటిని ఇచ్చారు.
ఆ మందులు పిచికారీ చేస్తే ఆకులు వాడిపోయాయి. పూత, పిందె పాడైపోయాయి. దీంతో దుకాణం యజమానికి ఫోన్ చేస్తే పంచదార ద్రావణం పిచికారి చేయమని సలహా ఇచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మళ్లీ దుకాణం వాళ్లకు చెప్పినా సరిగా స్పందించలేదని రైతు గోపాలకృష్ణ వాపోయాడు. పూత, పిందె నష్టపోకుండా ఉంటే 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని.. ఇప్పుడు పంట పాడై పోయి 40 వేల రూపాయల నష్టం వచ్చిందని రైతు తెలిపారు. దానిపై ఉద్యానశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
ఇదీ చదవండి: 'కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి'