గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ సమీపంలోని శంభులంగం చెరువు సమీపంలోని కొండ చుట్టుపక్కల సుమారు పదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతేడాది నుంచి అనుమతులు లేకుండానే వేల టిప్పర్ల ద్వారా ప్రైవేటు వెంచర్లకు మట్టి తరలించారు. కొండను ధ్వంసం చేసి రాయిని సమీపంలోని క్రషర్లకు తరలిస్తున్నారు. రాళ్లను కంకరగా మార్చి సమపంలోని పట్టణాలు, గ్రామాలకు తరలిస్తున్నారు. కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే మార్గంలో ఈటీ సమీపంలో మరో ఐదెకరాల ప్రభుత్వ భూమిలోనూ బహిరంగంగానే మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు మట్టి తరలించి… విక్రయిస్తున్నారు. పెద్దల అండదండలు ఉండటంతో రాత్రింబవళ్లు టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
మైనింగ్ శాఖ నుంచి మట్టి తవ్వకాలకు అనుమతులుంటే క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రాయిల్టీ చెల్లించాలి. కోటప్పకొండ సమీపంలో ఇప్పటి దాకా కేవలం 1200 క్యూబిక్ మీటర్లలో మాత్రమే మట్టి తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కొండ చుట్టపక్కల పరిశీలిస్తే సుమారు 60 వేల క్యూబిక్ మీటర్ల దాకా మట్టి తరలించారు. అనుమతులు తీసుకున్న చోట్ట కాకుండా వేరొక చోట మట్టి తవ్వకాలు చేపట్టారు. ఐదు నెలలు గడిచినా ఇంతవరకు మైనింగ్ శాఖకు రాయిల్టీ రూపంలో రూపాయి జమ కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 200 టిప్పర్ల మట్టి తరలిపోతుండగా, ఒక్కో టిప్పర్ రూ.7 వేలు చొప్పున రూ.12 లక్షల మట్టిని అక్రమార్కులు అమ్ముకుంటున్నారు. నెలకు రూ.3 కోట్ల 60 లక్షలకు పైగా మట్టిని ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా స్వాహా చేస్తున్నారు. సెస్ రూపంలో ప్రభుత్వానికి జమ కావాల్సిన ఆదాయానికి సైతం గండి కొడుతున్నారు.
జేసీబీతో మట్టి తవ్వకాలు చేస్తున్న ప్రాంతం
వారిద్దరి ప్రమేయంతోనే...:
కోటప్పకొండ సమీపంలో తవ్వకాల్లో మామ, అల్లుడు కీలకపాత్ర పోషిస్తున్నారని అధికార పార్టీకి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. కొండ సమీపంలో ఉన్న గ్రామానికి అల్లుడు సర్పంచిగా ఉండగా మామ గుత్తేదారునిగా ఉంటూ కోటప్పకొండ పైన దిగువున అభివృద్ధి పనులు చేస్తుంటారు. వీరిద్దరి కనుసన్నల్లోనే వేల టిప్పర్ల మట్టి తరలిపోతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే మా వెనుక ఎవరున్నారో తెలుసా..! అని చెబుతూ బెదిరిస్తున్నారు. మహాశివరాత్రి సమయంలో కొండ వద్ద జరిగిన అభివద్ధి పనుల పంపకాల్లో అక్కడున్న నేతల మద్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో మామ, అల్లుడు కొందరిపై దాడికి పాల్పడ్డారనే విమర్శలున్నాయి.
సబ్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్:
దీనిపై నరసరావుపేట సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందటంతో గత నెలలో ఆమె ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత వీఆర్వో, పంచాయితీ కార్యదర్శులను విచారించి, మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు. మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వలేదని చెప్పడంతో అక్కడ కాపలాగా వీఆర్వోను నియమించారు. అనుమతి లేకుండా ఒక్క టిప్పరు మట్టి కూడా తరలించొద్దని ఆదేశించారు. సబ్ కలెక్టర్ తనిఖీ చేసి వెళ్లిన అనంతరం మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. వారం రోజుల అనంతరం వీఆర్వోను అక్రమార్కులు బెదిరించడంతో అతను భయపడి వేరే గ్రామానికి బదిలీ చేయించుకున్నారు. ఆ స్థానంలో వేరొక మహిళను నియమించారు.
తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం..
కోటప్పకొండ సమీపంలో తనిఖీలు చేస్తాం. గతంలో వీఆర్వోని పర్యవేక్షకునిగా నియమించాం. అతను బదిలీ అయిన విషయం నా దృష్టికి రాలేదు. అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మైనింగ్ అధికారులతో మాట్లాడి అనధికార తవ్వకాలు జరగకుండా కట్టడి చేస్తాం. - శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్, సబ్ కలెక్టర్, నరసరావుపేట
ఇదీ చదవండి: