పీపీఈ కిట్ ధరించి వాహనాలపై హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్న ఈ వ్యక్తి మున్సిపల్ సిబ్బంది అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అతనో సాధారణ వ్యక్తే. పనులు దొరకని ఈ సమయంలో ఉపాధి కోసం ఆలోచన చేశాడు. కరోనా కాలంలో పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నాడతను. దాన్నే తన ఉపాధిగా మలుచుకున్నాడు.
గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఆటో నగర్ లో చిన్న టెంట్ వేసుకుని శానిటైసర్ సీసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అంతేనా రూ.20లకు స్ప్రేయర్ తో ద్విచక్ర వాహనానికి, ఆటోకు శానిటైజేషన్ ద్రావణం పిచికారీ చేస్తున్నాడు. అదే కారుకు శానిటైజేషన్ ద్రావణం పిచికారీ చేస్తే రూ.150 తీసుకుంటున్నాడు. కారును బయట నుంచి స్ప్రేయర్ తో, లోపల శానిటైజర్ ను పొగగా మార్చే పరికరంతో శుభ్రం చేస్తున్నాడు. శానిటైజేషన్ చేసేటప్పుడు స్వీయ రక్షణ కోసం పీపీఈ కిట్ కూడా ధరిస్తున్నాడు. ఇలా నిత్యం శానిటైజర్లు అమ్ముతూ, వాహనాలను శానిటైజ్ చేస్తూ రోజుకు రూ.1000 పైనే సంపాదిస్తున్నాడు.
లేని వాటి కోసం ఎదురు చూస్తూ, పోయిన వాటి కోసం బాధపడుతూ, రాని వాటి కోసం ఆరాట పడుతూ ఉండే కంటే మనకున్న పరిధిలోనే అవకాశాన్ని సృష్టించుకోవచ్చని నిరూపించాడు. మనసుంటే మార్గం ఉంటుందని గుర్తు చేస్తున్నాడీ వ్యక్తి.
ఇవీ చదవండి: కరోనా విజృంభిస్తున్నా గుంటూరు ప్రజల్లో కానరాని భయం