Employees Problems in Andhra Pradesh: ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో.. అప్పుడే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాడు. పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ కూడా సరిగ్గా సమయానికి వచ్చేటట్లుగా, ప్రతి డీఏ సమయానికి వచ్చేటట్లు చేస్తానని ప్రతి ఉద్యోగికి హామీ ఇస్తున్నా. ఇది 2018 జులై 9న తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జగన్ చెప్పిన మాటలు.
కానీ..వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. కష్టాలతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ప్రతి నెలా ఏ తేదీకి జీతాలొస్తాయో తెలీయదు. డీఏ, ఆర్జిత సెలవులు, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లింపు ఊసే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. మరో 3 నెలల తరువాత పదవీ విరమణ చేయనున్నవారి గుండెల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వైసీపీ ప్రభుత్వం గతేడాది జనవరిలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.
వచ్చే జనవరి నుంచి పదవీ విరమణలు మొదలవబోతున్నాయి. జూన్‌లో అత్యధికంగా ఉండొచ్చు. అయితే పదవీ విరమణ పొందిన ఉద్యోగులందికీ.. ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? వృద్ధాప్యంలో ఎలా బతకాలి? పిల్లలు, సొంతిళ్లు, మనవళ్ల శుభ కార్యక్రమాలు వంటి వాటి కోసం చేసిన అప్పుల పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు. సర్వీసు పూర్తవబోతున్న ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ.
పదవీ విరమణకు 6 నెలల ముందే ప్రభుత్వం ప్రాథమిక నోటీసు ఇవ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు రాలేదు. ఆర్థిక ప్రయోజనాల ప్రతిపాదనలను సంబంధిత డీడీవోల ద్వారా విభాగ అధిపతికి పంపించాలి. ఆ తర్వాత నిధులను అనుసరించి చెల్లింపులుంటాయి. పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల జాబితాలనే ప్రభుత్వం ఇంతవరకు ఆయా విభాగాలకు పంపలేదు. ఇప్పుడు పంపినా.. ఇంత స్వల్ప వ్యవధిలో అన్ని పనులూ పూర్తి కావటం కష్టమే.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపి రెగ్యులర్ ఉద్యోగులు 5 లక్షల 93వేల మంది వరకు ఉన్నారు. ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందితే ఆర్జిత సెలవులు 300 వరకూ ఉంటాయి. అంటే 10 నెలల జీతం, గ్రూపు ఇన్సూరెన్స్, ఏపీజీఎల్ పెండింగ్, జీపీఎఫ్, గ్రాట్యుటీ వస్తాయి. ఉద్యోగుల పొదుపు ఆధారంగా గ్రాట్యుటీ 10 లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒక్కో ఉద్యోగికి సరాసరి తక్కువలో తక్కువ వేసుకున్నా.. 50 లక్షలకుపైనే ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది. అదే జిల్లాస్థాయి గెజిటెడ్ అధికారైతే కోటిపైన చెల్లించాల్సి ఉంటుంది. ఇవికాకుండా పెండింగ్ డీఏలు ఇవ్వాలి.
ప్రతినెలా జీతాలే సక్రమంగా ఇవ్వలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనాలను పూర్తిగా చెల్లిస్తుందా? గత పీఆర్సీలో పింఛన్ దారులు, సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాల్సిన మొత్తాలనే పెండింగ్లో పెట్టింది. ఇదే కొనసాగితే ఉద్యోగులు తమ ప్రయోజనాలను పొందేందుకే నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన సీపీఎస్ వాటా 10 శాతంతోపాటు ఉద్యోగుల నుంచి మినహాయించిన 10 శాతాన్ని.. ప్రాన్ ఖాతాకు జమ చేయడం లేదు.
AP Velugu Employees Protest: సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం: వీవోఏ సంఘం
ఉద్యోగులకు ఇప్పటికే 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు 1,131 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని సెప్టెంబరులోపు జమ చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. 2022 జులై, 2023 జనవరి, జులై డీఏలను ప్రకటించలేదు. ఉద్యోగుల ఆర్జిత సెలవుల బిల్లులు 1,653 కోట్లు రూపాయలు రావాల్సి ఉంది. 11వ పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. దీన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యతిరేకించడంతో 2027వ సంవత్సరం వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ బకాయిలు రూ.7 వేల కోట్ల వరకు ఉన్నాయి.
పదవీ విరమణ పొందినవారికి, పొందేవారికి ముందుగానే ఇచ్చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లిస్తామని హామీ ఇచ్చింది. పింఛన్‌దారులతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో విలీనమయ్యాక అనారోగ్య కారణాలతో తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులకు 2020 నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు. రిటైరైన వారికి..సక్రమంగా చెల్లింపులు చేయడం లేదు.
Contract Professors Protest కాంట్రాక్టు అధ్యాపకులను నిలువునా ముంచేసిన వైసీపీ సర్కార్..