No Development in the State: రాష్ట్రంలో అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గత నాలుగేళ్లలో కీలకమైన ప్రాజెక్టులేవీ సాకారం కాలేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తకు నడకలు నేర్పుతోంది. రోడ్ల నిర్మాణమే కాదు వాటి మరమ్మతుల ఊసెత్తే పరిస్థితే చాలా చోట్ల లేదు. పోర్టులు, హార్బర్లు, విమానాశ్రయాల అభివద్ధీ నామమాత్రమే. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వివిధ సౌకర్యాల కల్పన కూడా సరిగా జరగలేదు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్రం మాత్రం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో.. జరగాల్సిన అభివృద్ధి పనులు అగిపోతున్నాయి.
నామమాత్రంగా మూలధన వ్యయం: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలపై భారం వేయకుండా వివిధ రూపాల్లో ఆదాయం పెంచుకోవాలి. ఎంత ఎక్కువగా ఆస్తులు సృష్టించుకుంటూ వెళ్తే.. రాబడి కూడా అంతగా పెరుగుతూ ఉంటుంది. అభివృద్ధి పనులపై వెచ్చించే నిధుల వల్ల అనేక రూపాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రజలకు ఉపాధి, ఆదాయమూ లభించి.. ఆ నిధులు పలు రూపాల్లో తిరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి వస్తాయి. అలా అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధులనే బడ్జెట్ పరిభాషలో మూలధన వ్యయం అంటారు. ఆ మూలధన వ్యయం రాష్ట్రంలో మరీ నామమాత్రంగా ఉంది.
అభివృద్ధి పనులు ఎక్కడ?: ఒక ప్రభుత్వంలో నాలుగేళ్ల కాలం అంటే చాలా ఎక్కువ కాలం. ఈ సమయంలో ఒక కొత్త ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్దం చేసి, టెండర్లు పిలిచి, పనులు అప్పగించి, పూర్తి చేసి ప్రజలకు అందించవచ్చు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఆర్థిక సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి. ఈ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. వెనక్కి తిరిగి చూసుకుంటే... రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎక్కడ అంటే.. సమాధానం మాత్రం దొరకదు.
హామీలు ఏమయ్యాయి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులు నెల్లూరు, సంగం బ్యారేజీలు మాత్రమే. ఆ రెండు ప్రాజెక్టులూ 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడేసరికే.. 70 శాతానికి పైగా పనులు పూర్తయిపోయినవే. జలవనరుల శాఖలో 2024 నాటికి మొత్తం 42 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలోనూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనూ.. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడి సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీలు ఇచ్చారు. ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మేనిఫెస్టోలోనూ చెప్పారు.
మూలనపడ్డ సాగునీటి ప్రాజెక్టులు: అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. నెల్లూరు, సంగం బ్యారేజీ మినహా ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. వేల కోట్లు అవసరమయ్యే సాగునీటి ప్రాజెక్టులపై కొంచం కూడా నిధులు ఖర్చు చేయడం లేదు. ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులే అంతంత మాత్రంగా ఉన్నాయి. వాటిలో కూడా సగం ఖర్చు చేయని పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... 11 నెలల్లో కేవలం 3 వేల 470 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికార గణాంకాలే చెబుతుండటం ఇందుకు నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి కలగానే ఉండిపోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో భూములను సాగులోకి తీసుకురావడనికి ఉద్దేశించిన కీలకమైన ప్రాజెక్టులు మూలనపడ్డాయి.. దీంతో.. అభివృద్ధికి అడుగులు పడటం లేదు.
లెక్కలు వేశారు.. నిధులు ఇవ్వలేదు: శ్రీశైలం ప్రాజెక్టు వరద జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 8 వేల 18 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసి, పనులు చేస్తున్నారు. దీని నిర్మాణం జరిగితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని మొత్తం 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీటి వసతి ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టును రెండు దశలుగా వర్గీకరించి మరో 2 వేల 700 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పుడో లెక్కలు వేశారు. గత నాలుగు సంవత్సరాలలో.. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఈ ప్రాజెక్టుకు చాలినన్ని నిధులివ్వలేదు. బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న విధంగా కూడా నిధులు ఇవ్వడం లేదు.
కరవు పోతుంది.. ఉపాధి దొరుకుతుంది: వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇస్తే.. దాన్ని నిర్మిస్తున్నంత కాలం అనేక మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే కరవు ప్రాంతాల్లో ఆయకట్టు సాగులోకి వస్తుంది. నీటి కోసం పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. ప్రాజెక్టు కింద సాగులోకి వచ్చే వందల గ్రామాల ప్రజలకు.. వ్యవసాయ పనుల ద్వారా ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయాధారిత వ్యాపారం పెరుగుతుంది. వ్యవసాయ పెట్టుబడి రూపంలో ఎందరి వద్దకో చేరే డబ్బు వివిధ పన్నుల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఎకరానికి ఎంత లేదన్నా ఒక పంట కాలానికి 10 వేల రూపాయల ఆదాయం వచ్చినా రైతులందరికీ కలిపి ఏడాదికి 450 కోట్ల ఆదాయం దక్కుతుంది. అంటే అయిదేళ్లలోనే ప్రాజెక్టుపై చేసిన ఖర్చు తిరిగి వచ్చేస్తుంది.
అలా చేస్తే రాష్ట్ర ఖజానాకు రాబడి: రైతులు పంట డబ్బును వివిధ రూపాల్లో ఖర్చు చేయడం వల్ల సగటున 10 శాతం పన్ను లెక్కేసినా రాష్ట్ర ఖజానాకు 45 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. రైతులు ఖర్చు చేసే డబ్బు అనేక మంది వ్యాపారులు, వృత్తిదారులకు చేరుతుంది. వారు ఆ డబ్బును మళ్లీ వినియోగిస్తారు. ఇలా వివిధ రూపాల్లో నిధులు రావడంతో రాష్ట్ర ఖజానాకు రాబడి పెరుగుతుంది. ఆ నిధుల వినియోగంతో మరో రకంగా ఉపాధి ఏర్పడి, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఒక ప్రాజెక్టుపై ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి కొన్నేళ్లలోనే తిరిగి వచ్చినా.. ప్రాజెక్టు ఫలితంగా వచ్చే ఆదాయం వివిధ రూపాల్లో పెరుగుతూనే ఉంటుందనడానికి ఇదో ఉదాహరణ. రాష్ట్రంలో ఇలా ఆదాయం సంపాదించి పెట్టే అభివృద్ధి పనులపై నిధుల ఖర్చు అంతంత మాత్రంగా ఉండటంతో సంపద సృష్టి జరగడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఏడాదికి సగటున లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే.. అందులో కేవలం 7 వేల 630 కోట్లు మాత్రమే అభివృద్ధి పనులకు వెచ్చిస్తోందని గణాంకాలు పేర్కొంటున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాల్లో 14.16 శాతమే మూలధన వ్యయంగా చెప్పారు. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి చేసిన మొత్తం ఖర్చులో దీని వాటా కేవలం 7.04 శాతమే. 2020-21లో బడ్జెట్ అంచనాల్లో 13.30 శాతమే మూలధన వ్యయంగా చెప్పాగా.. చివరికి 10.14 శాతమే ఖర్చుచేశారు. 2021-22 బడ్జెట్ అంచనాల్లో 13.57 శాతాన్ని మూలధన వ్యయంగా అంచనా వేయగా.. 8.90 శాతమే ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు ముగిసేసరికి.. మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పనకు చేసింది 4.10 శాతం మాత్రమే.
ఇవీ చదవండి: