Special Enforcement Bureau Vehicles Rent: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) అధికారులకు పెట్టిన వాహనాలకు డబ్బులు చెల్లించాలని.. వాహన యజమానులు ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర సెబ్ కమీషనర్ కార్యాలయం వద్ద 13 జిల్లాల నుంచి వచ్చిన వాహన యజమానులు ధర్నా చేపట్టారు. అక్రమ మద్యం, ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకునేందుకు తాము కార్లను సెబ్ అధికారులకు పెట్టామని.. 13 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదని వాహన యజమానులు ఆరోపించారు. సుమారు రూ.5 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ఇళ్లల్లో బంగారాన్ని తాకట్టుపెట్టి వాహనాల వాయిదాలు చెల్లించామని.. ఇకపై ఆ స్తోమత లేకే ధర్నా చేపట్టామని వాహన యజమానులు చెప్పారు.
"ఇసుక, మందు తరలించడానికి.. 2020లో వాహనాలను పెట్టాం. ఒక సంవత్సరం పాటు బిల్లులు చెల్లించారు. 2021 నుంచి ఇప్పటివరకూ చెల్లించలేదు. పది నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. వివిధ కారణాలతో మమ్మల్ని తిప్పుతున్నారు. ఇప్పటికి వారం రోజులు అయింది మేము విజయవాడ వచ్చి.. వేరు వేరు జిల్లాల నుంచి వచ్చాం". - వెంకటేశ్వరరావు, వాహన యజమాని
"సుమారు 5 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మేము వచ్చిన ప్రతిసారీ ఒక్కొక్కరికీ 5 నుంచి 10 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఫైల్ ముందుకు కదలలేదు". - శేఖర్, వాహన యజమాని
ఇవీ చదవండి: