YSRCP Government Wasting Public: ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన జగన్.. అది అధికార కార్యక్రమం అన్న విచక్షణ లేకుండా పరుష పదజాలంతో విపక్షాలపై విమర్శలు చేయడంతో.. ఇక మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నాయకులు చెలరేగిపోతున్నారు. ఏది అధికారిక కార్యక్రమమో, ఏది పార్టీ సభో గుర్తించలేని విధంగా మార్చేస్తున్నారు. సభలు, సమావేశాలు మాత్రమే ఆ తీరుగా జరుగుతున్నాయనుకుంటే పొరపాటే.
సంక్షేమ పథకాలపై.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో కూడా రాజకీయ కోణాన్ని జొప్పించడం, అధికార పార్టీ దృష్టితో విశ్లేషణలు జోడించడం, వాస్తవాల్ని వక్రీకరించడం యథేచ్ఛగా సాగుతోంది. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా.. లెక్క చేయకుండా.. టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడం, ప్రభుత్వ కార్యక్రమాల్నీ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపేసి వైసీపీ కార్యక్రమాలుగా మార్చేయడం, ప్రశ్నించినవారిపై దాడులకు దిగడం వారికి అలవాటుగా మారిపోయింది
Contract workers fire on CM ''మాట తప్పారు.. వెన్నుపోటు పొడిచారు.. " కాంట్రాక్టు ఉద్యోగుల ఆగ్రహం
సభ ఏదైనా ఒకే ఫార్మాట్: అది ఏ సభయినా.. ముఖ్యమంత్రి ప్రసంగానికి ఒకే ఫార్మాట్‌ని అనుసరిస్తున్నారు. ఆయన అరగంటో, 40 నిమిషాలో మాట్లాడితే.. దానిలో సగం సమయం ఆ సంక్షేమ పథకంతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాల్ని వివరిస్తారు. మధ్యలో ఒక టర్న్ తీసుకుని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌నీ దుమ్మెత్తిపోస్తారు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి ప్రసంగం ముగియదు. 'దుష్టచతుష్టయం', 'దత్తపుత్రుడు'.. అంటూ అక్కసు వెళ్లగక్కుతారు. చంద్రబాబును ఉద్దేశించి ముసలాయన, పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్ని ప్రస్తావిస్తూ.. కించపరిచేలా మాట్లాడటం, అభ్యంతరకర పదజాలంతో నిందించడం వంటివి.. జగన్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయనట్టూ, వైసీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో సంక్షేమమనే స్వర్ణయుగం ఆరంభమైనట్లు.. అభూతకల్పనలతో హోరెత్తిస్తారు. పేదలు, పెత్తందార్లు అంటూ వర్గవైషమ్యాల్ని రెచ్చగొట్టి.. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారు. ఒకపక్క అధికార పార్టీ నాయకులు ఇసుక, మద్యం, గనులు వంటి వ్యవహారాల్లో.. 'దోచుకో, పంచుకో, తినుకో' విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ.. అది తమ పేటెంట్‌గా భావిస్తుంటే.. ముఖ్యమంత్రి మాత్రం దాన్ని విపక్షాలకు, తనకు గిట్టని మీడియాకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ సభయినా ఇదే ఫార్మాట్.
public : అధికార పార్టీ నిర్బంధ సభలు..! వచ్చామా... కనిపించామా.. వెళ్లిపోయామా అంటున్న ప్రజలు
సీఎం వాడాల్సిన పదజాలం ఇదేనా?: గత సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల మీటింగ్ కాబట్టి సహజంగానే దానికి హాజరయ్యేవారిలో పిల్లలే ఎక్కువగా ఉంటారు. సీఎం వారిని ఉద్దేశించి కూడా రాజకీయ ప్రసంగమే చేయడం, ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి.. ''14 ఏళ్లు అధికారంలో ఉండి ఏం గాడిదలు కాశావ్?'' వంటి పరుషపదజాలంతో విరుచుకుపడటం ద్వారా ఆయన స్కూల్ పిల్లలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ ఏ పథకానికైనా బటన్ నొక్కే రోజు పత్రికల్లో ఇచ్చే ప్రకటనల్లో కూడా.. వైసీపీ కోణంలో చేసే విశ్లేషణలు, గత ప్రభుత్వంపై విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఇవీ, ప్రస్తుతం చేస్తున్నవి ఇవీ అంటూ పోల్చి చెబుతున్నారు. వాటిలో అభూతకల్పనలు, వక్రీకరణలే అధికంగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక్కో సభకు 5 కోట్ల రూపాయల ఖర్చు: జిల్లాల్లో సీఎం పాల్గొంటున్న సభల నిర్వహణకు.. ఒక్కోదానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోంది. అంత భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న సభల్ని.. ప్రదానంలో ప్రతిపక్షాలపై విషం చిమ్మేందుకు, రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం, ఒక వ్యూహం ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ప్రతిపక్షాలపై రాజకీయ దాడి చేసేందుకే ముఖ్యమంత్రి ఎక్కువ సమయం కేటాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో.. ముఖ్యమంత్రి జగన్ ఒక పరిశ్రమకో, ప్రాజెక్టుకో శంకుస్థాపనో, ప్రారంభోత్సవమో చేయడం కోసం నిర్వహించిన సభలను.. వేళ్లపైనే లెక్కపెట్టొచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏటా ఇచ్చేవే అయినా.. ప్రతిసారీ కొత్తగా ఇస్తున్నట్లుగా సభలు నిర్వహిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచే బటన్‌లు నొక్కిన జగన్.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో.. జనం మధ్య బహిరంగ సభల్లో బటన్ నొక్కుతున్నారు. ఆ సభలకు ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెడుతున్నారు.
స్టడీ మెటీరియలా.. వైసీపీ కరపత్రమా..!
విషప్రచారం: బస్సుల్లో జనాన్ని తరలిస్తన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా జీతం తీసుకుంటున్న వాలంటీర్లు.. జనాన్ని తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం ప్రజల్లోకి రావడాన్ని, సభలు నిర్వహించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహిస్తున్న ఆ సభల్ని.. ఫక్తు రాజకీయ ప్రచార సభల్లా మార్చేయడంపైనే వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సభ ఎవరి కోసం నిర్వహిస్తున్నాం, ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేశాం, హాజరైనవారు రైతులా, మహళలా, విద్యార్థులా అన్న విషయాన్ని పక్కనపెట్టి.. ప్రతిపక్షాలపై దుమ్మత్తిపోయడమే ముఖ్యమంత్రి ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లో నాయకులు కొంత రాజకీయ విమర్శలు చేసినప్పుటికీ.. దానికి ఒక పద్ధతి ఉండేది. నాయకులు స్వీయ నియంత్రణ పాటించేవారు. దానికి భిన్నంగా.. ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ నాయకులు అన్ని రకాల సంప్రదాయాల్ని గాలికొదిలేసి.. ప్రతిపక్షాలపై విషప్రచారాన్ని, వ్యక్తిగత విమర్శల్ని పతాకస్థాయికి తీసుకెళ్లడం అన్ని వర్గాల వారినీ దిగ్భ్రమకు గురిచేస్తోంది.
వాలంటీర్లతో "ఓటు" మాట.. సమావేశాలు నిర్వహించి మరీ దిశా నిర్దేశం
ప్రజల గురించి ఆలోచించడం లేదా?: అసలే ఎండలు మండిపోతున్నాయన్న ఆలోచన కూడా లేకుండా.. సీఎం సభల పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని నవీముంబయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమానికి భారీగా జనాన్ని తరలించారు. తీవ్రమైన ఎండతో వడదెబ్బ తగిలి.. 12 మంది చనిపోయారు.
మరో 600 మంది అస్వస్థతకు గురయ్యారు. అలాంటి ఘటనల గురించి విన్న తర్వాత కూడా.. కనీస శ్రద్ధ లేకుండా ప్రభుత్వం ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక సభ నిర్వహించింది. విద్యార్థులను సీఎం సభలో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కూర్చోబెట్టడంతో.. వారంతా తీవ్రమైన వేడిలో అల్లాడిపోయారు. సభకు వచ్చిన అమరావతి మండలం లింగాపురం జెడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయిని ఎం.పద్మ.. వడదెబ్బకు గురై.. మరుసటి రోజు చనిపోయారు.