ప్రధాని మోదీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు అడ్డుకోవటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. రూ. 2లక్షల కోట్ల సంపదను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేస్తుంటే మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ.. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో అంబేడ్కర్ కూడలి నుంచి అమృతరావు విగ్రహం వరకు సాగిన ర్యాలీలో రామకృష్ణ పాల్గొన్నారు.
గతంలో స్టీలు ప్లాంటు వాటాల్ని పోస్కో కంపెనీకి అప్పగించేందుకు విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం జరిపారని.. ఇపుడూ అందుకే మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయటానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కుని ప్రైవేటుకు ఇస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో 13 జిల్లాలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాసరావు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం'