Couple suicide: నమ్మిన వారికి హామీ ఉండి డబ్బులు ఇప్పించారు. వాళ్లు తిరిగి ఇవ్వకపోవడంతో ఇల్లు, ఆస్తులు అమ్మి చెల్లించారు. అయినా ఆ అప్పులు తీరలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక క్షోభకు గురవడంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ పటమటలంకకు చెందిన పాతూరి రత్తయ్య (62), పాతూరి నీరజల (56) ఒక్కగానొక్క కుమారుడు రాహుల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కెనడాలో స్థిరపడ్డారు. రత్తయ్యకు జి.కొండూరులో సొంతంగా క్రషర్ ఉంది. తన వ్యాపార భాగస్వాములైన వెంకటేశ్వరరావు, శ్రీదేవిలకు రత్తయ్య హామీ ఉండి వేరేవాళ్ల దగ్గర అప్పు ఇప్పించారు. అది వడ్డీతో రూ.3 కోట్లకు చేరుకుంది. వెంకటేశ్వరరావు, శ్రీదేవి ఆ అప్పులను తీర్చలేదు. దాంతో రత్తయ్య సొంత క్రషర్‌ను, ఇల్లు ఇతర ఆస్తులను అమ్ముకున్నారు. అయినా అప్పులు తీరలేదు. ఆ తర్వాత గుంటూరు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెంవద్ద తన బంధువులకు చెందిన క్రషర్‌లో రత్తయ్య మేనేజరుగా ఉద్యోగంలో చేరారు.
కొంతకాలం పని చేసిన అనంతరం అనారోగ్యం కారణంగా సెలవుపెట్టి 5 నెలల క్రితం ఇంటికి వెళ్లారు. సొంతూరులో ఉండలేక తాడేపల్లిలో అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం రత్తయ్య, నీరజ దంపతులిద్దరూ తాడేపల్లిలోని నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సాయంత్రానికి ఈపూరు మండలం ముప్పాళ్ల వద్దకు చేరుకున్నారు. వాహనాన్ని అద్దంకి బ్రాంచి కాల్వకట్టపై ఉంచి ఇద్దరూ కాల్వలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. గత మూడు రోజులుగా రత్తయ్య దంపతులు కనిపించకపోవడంతో ఆయన తోడల్లుడు మంగళవారం ఉదయం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారు వెళ్లి ఇంటిని పరిశీలించగా అక్కడ సూసైడ్ నోట్ దొరికింది. అందులో.. వెంకటేశ్వరరావు, శ్రీదేవిలకు హామీ ఉండి ఇప్పించిన అప్పు వడ్డీతో రూ.3 కోట్లు అయిందని, తీసుకున్నవాళ్లు ఎగ్గొట్టడంతో ఆస్తులు అమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చిందని, అయినా తీరలేదని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని తాడేపల్లి సీఐ సాంబశివరావు తెలిపారు.
ఇదీ చూడండి:
CI suspended for cheating women in eluru: యువతిని మోసగించిన కేసులో.. సీఐ సస్పెండ్