కరోనా ప్రభావం పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ఊపిరి ఆడనీయడం లేదు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు పొంది ఉత్పత్తి ప్రారంభించాయి. అయితే కార్మికుల కొరత, ముడి సరకుల రవాణలో సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. ఏదోలా కష్టపడి ఉత్పత్తి చేసినా మార్కెటింగ్‌కూ తిప్పలే. అయితే యంత్రాలు వినియోగంలో లేకుంటే పాడైపోతాయని చాలామంది పరిశ్రమలు నడుపుతున్నారు. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం నిర్వహణ ఖర్చులన్నా వస్తే చాలని పలువురు నిర్వాహకులు పేర్కొనడం పరిస్థితికి నిదర్శనం.
- అతకని గొలుసు
పారిశ్రామిక రంగానికి సంబంధించి కరోనా ప్రభావంతో తెగిన గొలుసుకట్టు (సప్లయ్ చైన్) అతకటం లేదు. ఒక వస్తువు తయారీకి నాలుగైదు పరిశ్రమల నుంచి ఉత్పత్తులు రావాలి. ఎక్కడ సమస్య తలెత్తినా ఆ ప్రభావం ఇతర పరిశ్రమలపై పడుతోంది. గొలుసుకట్టు సవ్యంగా లేక వస్తువుల ఉత్పత్తి 30-40 శాతం దాటడం లేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఆటోనగర్ పారిశ్రామికవాడలో ఓ రేడియేటర్ల తయారీ సంస్థ అనుబంధంగా ప్యాకింగ్ పెట్టెల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.
కరోనా ప్రభావంతో రేడియేటర్లకు డిమాండ్ తగ్గింది. దీని ప్రభావం ప్యాకింగ్ పెట్టెల తయారీపైనా పడింది. ఇతర పరిశ్రమల నుంచీ ప్యాకింగ్ పెట్టెలకు ఆర్డర్లు తగ్గాయని పరిశ్రమ నిర్వాహకుడు తెలిపారు. నిర్మాణ రంగ సామగ్రి తయారీ పరిశ్రమలు, వస్త్ర రంగ పరిశ్రమలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
- శుభకార్యాలు ఆగిపోయి..
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ సమయంలో కొత్తకాపురానికి అవసరమైన సామగ్రి, అతిథులకు బహుమానాల కోసం స్టీలు, అల్యూమినియం వస్తువుల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ 3 నెలలు లాక్‌డౌన్‌లో పోయాయి. తిరిగి ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించినా మార్కెట్ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవని స్టీలు, అల్యూమినియం పరిశ్రమ నిర్వహించే పారిశ్రామికవేత్త శ్రీరాం తెలిపారు. ఇలాంటి పరిశ్రమలు కృష్ణా, గుంటూరులో సుమారు 100 వరకు ఉన్నాయి.
- కార్మికుల కొరతా కారణమే
* గతంలో 3 షిఫ్టుల్లో పనిచేసే పరిశ్రమలు ఇప్పుడు ఒక షిఫ్టుకే పరిమితమయ్యాయి. ఉత్పత్తి పెంచాలంటే సిబ్బంది కొరత సమస్యగా ఉంది. అత్యధిక పరిశ్రమల్లో రోజూ 25-30 శాతం మంది హాజరుకావటం లేదు.
* రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోక పరిశ్రమలకు ముడిసరకు సక్రమంగా అందటం లేదు.
* ప్రస్తుతం ఎక్కువమంది అత్యవసర వస్తువులే కొంటున్నారు. దీంతో ఇతర వస్తువులను తయారుచేసే పరిశ్రమలు ఉత్పత్తి తగ్గిస్తున్నాయి.
* కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుదేలయ్యాయి.
ఇవీ చదవండి...
విధుల్లో అవమానాలు, బెదిరింపులు భరించలేం : ప్రభుత్వ వైద్యుల సంఘం