Ram Charan Birthday Fight: గుంటూరు జిల్లాలో సినీ నటుడు రామ్‌చరణ్ జన్మదిన వేడుకలు రసాభాసగా మారాయి. మేడి కొండూరు మండలం విసదల అడ్డు రోడ్డు వద్ద రామ్‌చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, చరణ్ అభిమానులు, గుంటూరు, పేరేచర్ల, సత్తెనపల్లికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే కేక్ కోస్తుండగా అక్కడ ఉన్న విద్యార్థుల మధ్య ఒక విషయంలో మాటా మాటా పెరిగింది.
ఆ క్రమంలో వారిలో ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు కొందరు చేయి చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేడి కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. సమీపంలో ఉన్న ప్రధాన రహదారి పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలు, విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీనివల్ల జనసేన కార్యకర్తల ద్విచక్ర వాహనాలు కొంత మేర దెబ్బతిన్నాయి. దీంతో జనసేన కార్యకర్తలకు కోపం వచ్చి.. విద్యార్థులు కొట్టుకుంటే మాపై మీ ప్రతాపం చూపించటం ఏంటి?అని నిలదీశారు.
దీంతోపాటు విద్యార్థులను కూడా కొడతారా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని ముందుకు పోనీకుండా అడ్డుగా నిలబడ్డారు. 'పోలీస్.. డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. కాసేపు పోలీస్ వాహనానికి అడ్డుగా రోడ్డు మీద కుర్చుని.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అక్కడే ఉన్న కొంత మంది జనసేన కార్యకర్తలు కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో అక్కడ నుంచి అందరూ వెళ్లి పోయారు. సీఐ వాసు తన సిబ్బందిని తీసుకొని ఆక్కదకు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా.. రామ్‌చరణ్ తాజాగా ఆర్సీ 15 (RC) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. పొలికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ రామ్‌చరణ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ అంజలి కూడా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ 15 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు.