Tulasi Reddy Comments on the Government: ఆంధ్రప్రదేశ్‌కు వరం కావాల్సిన పోలవరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్లక్ష్యంతో శాపంగా మార్చాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనచైతన్య వేదిక గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
సాగునీటి రంగానికి గత ప్రభుత్వాలతో పోలిస్తే వైసీపీ సర్కారు బడ్జెట్ కేటాయింపులు భారీగా తగ్గించిందని ఆరోపించారు. గతంలో బడ్జెట్లో 15 నుంచి 17 శాతం నిధులను నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించేవారని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత.. అది రెండు శాతంగా ఉందని తెలిపారు. దీంతో కీలకమైన ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి వదిలివేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం ద్వారా ఇబ్బందులు వచ్చాయన్నారు.
కేంద్రానికే ఆ పనులు అప్పగిస్తే పూర్తి చేసే బాధ్యత వారిపై ఉండేదన్నారు. ఇక తెలంగాణా నిర్మిస్తున్న పాలమూరు, దిండి ప్రాజెక్టులు, కర్నాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టులతో ఏపీలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు నీరు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా న్యాయపరంగా కూడా పోరాడాలని సూచించారు. పైనుంచి మనకు నీళ్లు వచ్చేలా చూడాలని అన్నారు.
"పోలవరం ప్రాజెక్టుకు అప్పుడేమో 15 నుంచి 17 శాతం నిధులను కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019-20 నుంచి వరుసగా 5 శాతానికి మించడం లేదు. పోనీ అదైనా ఖర్చు పెడుతున్నారా అంటే.. అందులో కూడా కేవలం 50 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తంగా బడ్జెట్లో 2 - 2.5 శాతం మధ్యలో మాత్రమే నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తోంది. పర్యవసానంగా ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో.. ముందు నీరు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా.. నీటిని ఉపయోగించుకునే పరిస్థితులు లేవు.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెండు విధాలుగా పోరాడాలి. ఒకటి బడ్జెట్ కేటాయింపులు చేసి.. ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేయాలి. రెండవది పైనుంచి మనకు నీళ్లు వచ్చేలా న్యాయపరంగా పోరాడాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో రాజకీయంగా కూడా పోరాడాలి. కాబట్టి బహుముఖ వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాం. కాబట్టి కేంద్రానిది 90 శాతం, రాష్ట్రానిది 10 శాతంగా ఉండి.. వరం కావాల్సిన పోలవరం.. శాపంగా మారింది". - తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత
ఇవీ చదవండి: