TOURIST POICE STATIONS : రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పర్యాటకులకు భద్రత కల్పించడం, సమాచారం అందించడమే టూరిస్ట్ పోలీస్స్టేషన్ల ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పోలీస్స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖలో సంస్కరణలు: పోలీసుశాఖలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామస్థాయిలోనే మహిళా పోలీసులు, గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారని తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. గతానికి ఇప్పటికి విపరీతమైన తేడా చూపించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీసు స్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్‌ను కోటి 20 లక్షల పైన మహిళలు డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. దిశ యాప్‌లో ఫిర్యాదు చేస్తే 5 సెకన్ల లోపు రిప్లై ఇవ్వడం.. 5-10 నిముషాల లోపు ఘటనా స్థలికి వెళ్లే ఏర్పాట్లు చేశామన్నారు.
"టూరిస్టులకు పోలీసులు మీ స్నేహితులే అనే భావన కలిగించే విధంగా వీటిని ఏర్పాటు చేశాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిసెప్షనిస్టులను అందుబాటులో ఉంచుతున్నాం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోటి మందికి పైగా మహిళలు సెల్ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖలో మార్పులు తీసుకొచ్చాం. ఇటువంటి మార్పుల్లోనే భాగంగా 20 టూరిస్టు పోలీస్స్టషన్లను ఏర్పాటు చేశాం. పర్యాటకులకు భద్రత కల్పించడం, సమాచారం అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చాం"-సీఎం జగన్
టూరిస్టు పోలీస్‌స్టేషన్‌లో కియోస్క్‌లు ఏర్పాటు: టూరిస్టు పోలీసు స్టేషన్లలో కియాస్క్‌లు ఏర్పాటు చేసి లోకల్ పోలీసు స్టేషన్లకు అనుసంధానించామన్నారు. టూరిస్టు పోలీసు స్టేషన్లలో కియోస్కులను ఏర్పాటు చేశామన్నారు. ఒక్క కియాస్కులో ఆరు గురు సిబ్బంది పని చేసేలా రూపకల్పన చేశామన్నారు. టూరిస్టు పోలీసు స్టేషన్‌ను ఎస్సై లేదా ఏఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారన్నారు. కియోస్క్‌లపై టెలిఫోన్ నెంబర్‌ను కేటాయించి ప్రదర్శన చేస్తామన్నారు. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాన్ని వివరంగా తెలపడానికి కరపత్రాలు సిద్ధం చేశామన్నారు. ఈ కరపత్రాలు టూరిస్టు పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచుతామన్నారు.
టూరిస్టు పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది అంకితభావంతో పని చేయాలి: ఎమర్జెన్సీ సమయంలో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో భద్రతకు భరోసా ఇస్తూ టూరిస్టు పోలీసు స్టేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేశారు. మహిళా టూరిస్టులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా టూరిస్టు పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలీసు శాఖలో సువర్ణ అధ్యాయంలా ఈ కార్యక్రమం నిలబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో గొప్ప సంస్కరణగా టూరిస్టు పోలీసు స్టేషన్ల ఏర్పాటు మిగిలిపోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. టూరిస్టు పోలీసు స్టేషన్లలో సిబ్బంది అంకిత భావం, సేవాభావంతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: