CM Jagan meeting with YSR Congress Party Coordinators: ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల్లో ఎవరెవరి లెక్కలు ఎలా ఉన్నాయి. పార్టీ కేడర్లో వారికున్న సానుకూలత, వ్యతిరేకతలేంటని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ సమన్వయకర్తలతో సమీక్షించారు. ప్రధానంగా గ్రూపులు, వర్గ విభేదాలపై చర్చించినట్లు తెలిసింది. ఏయే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉందో ఆరా తీసినట్లు సమాచారం.
క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ మంగళవారం సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో గ్రూపులను ఎక్కడికక్కడ కట్టడి చేయాలని వారికి స్పష్టం చేశారు. వర్గవిభేదాలను ఇప్పటి నుంచే సరిదిద్దాలని సూచించినట్లు తెలిసింది. ఎన్నికల వరకు పార్టీ ప్రకటించిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లేలా చేయాలని సూచించారు.
దసరా పండగ ఉన్నందున ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 25న కాకుండా 26న సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించాలని సీఎం జగన్ చెప్పారు. 26న రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ యాత్ర అట్టహాసంగా మొదలవ్వాలన్నారు. మూడు ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున రోజూ మూడు నియోజకవర్గాల్లో యాత్ర, అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసేలా రూట్ మ్యాప్ ఇవ్వాలని చెప్పారు. యాత్రకు ప్రాంతాల వారిగా సమన్వయకర్తలను సీఎం జగన్ నియమించారు.
Prathidhwani: ఉద్యోగుల జీతాలకు దిక్కు లేదు.. ప్రకటనలకు భారీగా చెల్లింపులు
సామాజిక న్యాయ బస్సు యాత్ర సమన్వయకర్తలు
- బస్సు యాత్రకు రాయలసీమ జిల్లాలకు (తిరుపతి తప్పా) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమన్వయం చేయనున్నారు.
- ఉత్తరాంధ్రకు మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు ఆ ప్రాంత వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి,
- ఉభయగోదావరి జిల్లాలకు ఎంపీ మిథున్‌రెడ్డి,
- కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.
- పల్నాడు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎంపీ విజయసాయిరెడ్డిని సమన్వయకర్తలుగా
ఈ నాలుగేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, నిరుపేదలకు ఏమేం చేశామనేది యాత్రలో సభల ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం చెప్పారు. సమావేశాలకు వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరయ్యేలా చూడాలన్నారు.