CM Jagan cheating SCs: తెలంగాణలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో భరోసాని ఇస్తోంది. కొన్ని వేల నిరుపేద ఎస్సీ కుటుంబాల తలరాతను ఈ పథకం మార్చేసింది. లక్ష, 2 లక్షలు కాదు ఏకంగా 10లక్షల రూపాయల మొత్తాన్ని పూర్తి ఉచితంగా ఇచ్చి దళితుల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ.. వారితో సంపద సృష్టింపజేస్తోంది. అంతేకాదు వారు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా వారి వెన్నంటే నిలుస్తోంది. గడిచిన రెండేళ్లలో 38 వేల 323 ఎస్సీ కుటుంబాలకు 3,832 కోట్ల సాయం.. అందించింది. ఇది కదా ఎస్సీలకు తిరుగులేని దన్నుగా నిలవడమంటే. వారి కుటుంబాల్లో.. దివ్వెలను వెలిగించడమంటే.
మాట్లాడితే చాలు ‘నా ఎస్సీ-నా ఎస్సీ అంటూ.. గుండెలు బాదుకునే ముఖ్యమంత్రి జగన్ గత నాలుగేళ్లలో ఒక్క కుటుంబానికైనా ఈ తరహా అండనిచ్చారా? కనీసం.. ఇలాంటి ఆలోచనైనా చేశారా? అదేమీ లేకపోగా దశాబ్దాలుగా ఎస్సీల కోసమే ప్రత్యేకంగా అమలైన పథకాలకూ అధికారం చేపట్టగానే పాతరేశారు కదా? అందరికీ ఇచ్చే అమ్మఒడి, చేయూత, ఆసరా, తదితర నవరత్న పథకాలనే..ఎస్సీలకూ వర్తింపజేస్తూ అదే మహద్భాగ్యమన్నట్లు గొప్పలు చెబుతారా?
తెలంగాణలో దళిత బంధు సాయం ద్వారా కల్యాణమండపాలు, సంచుల తయారీ, లేడీస్ ఎంపోరియం, మ్యాచింగ్ సెంటర్లు, కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ.. ఫొటోగ్రఫీ, ట్యాక్సీ, ఇటుకల తయారీ, ఫ్లెక్సీ ప్రింటింగ్ డిజైన్ దుకాణం, ఇలా వందల కొద్దీ.. యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇచ్చే 10 లక్షల్లో 9.90 లక్షల్ని నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగతా 10 వేలకు తెలంగాణ ప్రభుత్వం మరో 10 వేలు జత చేసి.. కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్య వచ్చి.. ఆ ఎస్సీ కుటుంబం వ్యాపారంలో దెబ్బతిన్నా.. కుటుంబ పెద్దను కోల్పోయినా వారికి.. ఇందులో నుంచి సాయం అందిస్తుంది.
ఏపీలో ఎస్సీలకు ఎందుకు ఇలాంటి ప్రగతికి నోచుకోరు? కేవలం ముఖ్యమంత్రి జగన్.. విధానాల కారణంగానే ఏళ్లుగా అమలవుతున్న పథకాలనూ.. వారు కోల్పోయారు. ఎస్సీల నుంచి ఉపముఖ్యమంత్రి సహా అయిదుగురు మంత్రులు, 23మంది.. ఎమ్మెల్యేలు ఉన్నా ఏం లాభం? జగన్ అధికారం చేపట్టాక తెలంగాణలో ఉన్న విధంగా ఎస్సీ, ఎస్టీల కోసం ఒక్క ప్రత్యేక పథకాన్ని తీసుకురాలేదు. పైగా దశాబ్దాలుగా వారి అభివృద్ధికి వెన్నుదన్నుగా ఉన్న.. 27 పథకాలను రద్దు అనే మాట వాడకుండా నిర్వీర్యం చేసిందని.. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ధ్వజమెత్తారు.
Lift irrigation: నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు..సాగునీరు అందక రైతుల అవస్థలు
భూమి కొనుగోలు పథకం.. స్వయం ఉపాధి రుణాలు, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం, విద్యోన్నతి.. ఎస్సీలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ, తదితర వాటి అమలు నిలిపేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిరుపేద ఎస్సీల కోసం భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశాయి. ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలాన్ని కొని.. సాగు చేసుకునేందుకు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటుగా రాయితీ 70 శాతం ఇస్తుండగా జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ 30 శాతం రుణంగా ఇస్తుంది. ఈ పథకం కింద 1988-2019 మధ్య 23 వేల 802 మంది.. ఎస్సీ మహిళలకు సుమారు 24వేల ఎకరాలు అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత దళితుల కోసం.. తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. 2014-22 వరకు 9 ఏళ్లలో.. 769 కోట్లు వెచ్చించి 17వేల ఎకరాలను కొని.. 6 వేల 998 మంది ఎస్సీ రైతులకు పంపిణీ చేసింది. కానీ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని నిలిపేశారు. ఎస్సీలు తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని జయించేందుకు.. స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంచి అవకాశం. దీన్ని తెలంగాణ ప్రభుత్వం.. మరింత ముందుకు తీసుకెళ్లి రాయితీపై కాకుండా.. పూర్తి ఉచితంగా 10 లక్షల వరకు ఇస్తోంది. దీంతోపాటు 2014-23 వరకు ఆర్థిక చేయూత పథకం కింద 60- 80% రాయితీతో.. దాదాపు 1.62 లక్షల మంది ఎస్సీలకు 2,209 కోట్ల మేర ఖర్చు చేసింది.
6.25 శాతం కౌలు రైతులకే సాయం.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి..?
జగన్ విషయానికి వస్తే.. 10 లక్షలు ఇవ్వడం అటుంచి ఏళ్లుగా ఎస్సీలకు అండగా నిలుస్తున్న రాయితీరుణాలనూ నిలిపేశారు. గతంలో లబ్ధిదారులు స్థాపించే యూనిట్‌ను బట్టి 40-90 శాతం వరకురాయితీతో లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ఇలా ఏటా వేల మంది.. లబ్ధి పొందారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టగానే.. రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను నిలిపేసి ఎస్సీ యువత వెన్నువిరిచింది.
అధికారంలోకి వచ్చాక జగన్ ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయితీ రుణాలివ్వకపోగా కేంద్రం నుంచి వచ్చే సాయానికీ మోకాలడ్డారు. ఏళ్లుగా జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ- NSFDC, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ- NSTFDC ద్వారా అందే సహకారానికి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా.. పథకాలనే నిలిపేశారు. ఈ సంస్థలు టర్మ్ లోను పేరుతో గరిష్ఠంగా 50 లక్షలు.. సూక్ష్మ రుణం కింద 3 లక్షల వరకు ఇస్తాయి. రాయితీ గరిష్ఠంగా 50% ఉంటుంది. 2015-19 మధ్య.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు 23 వేల మంది ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకాల ద్వారా.. 515 కోట్లకుపైగా సాయం అందింది.
'27 పథకాల్ని రద్దు చేసిన వైకాపాకు బుద్ధి చెబుదాం..'
జగన్ కూడా ఈ పథకాలను అమలు చేసి ఉంటే.. సుమారు ఎస్సీ, ఎస్టీలకు 300 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరేదని.. ఆ అవకాశం దక్కకుండా చేశారని ఎస్సీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలు 18శాతం, ఎస్టీలు 7.5శాతం మంది ఉన్నారు. ఏటా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద కేటాయించే నిధులు ప్రత్యేకంగా.. వారి వ్యక్తిగత అభివృద్ధికి వినియోగించాలి. గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పేరుతోనూ..30% నిధుల్ని వినియోగించాయి.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మంచి జరిగేలా దీన్ని ప్రత్యేక ప్రగతి నిధి చట్టంగా అమలు చేస్తోంది. ఎస్సీలకు ఉద్దేశించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో.. ఈ నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే వాటిని మరుసటి ఏడాదికి బదలాయించే గొప్ప నిర్ణయం తీసుకుని.. అమలు చేస్తోంది. కానీ జగన్ చేస్తున్నదేంటి? ఉప ప్రణాళిక నిధుల్ని.. నవరత్నాల్లోనే భాగం చేసి జగన్ తీరని ద్రోహం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. జగన్ ఎస్సీలను మాయ చేసే ఎత్తుగడలకు తెర తీశారు. నిబంధనల పేరిట మోకాలడ్డుతూ నిధులు ఖర్చు కాకుండా పథకాలను ఎలా అమలు చేయొచ్చో చేసి చూపిస్తున్నారు. పైగా తాను చేసేది గొప్పని మాట్లాడుతున్నారు. విదేశీ విద్యాదీవెన పథకమూ.. ఈ కోవలోకే వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య 492 మంది ఎస్సీ విద్యార్థులకు.. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,031 మంది ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు ఆర్థికసాయంఅందించాయి.
వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగున్నరేళ్లలో.. ఈ పథకం కింద అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు ఎందరో తెలుసా? కేవలం 35 మంది. అదీ జగన్ మార్క్ మోసం అంటే. 1995 నుంచి ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థుల కోసం అమలైన.. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్ పథకాన్ని నీరుగార్చింది. ఎస్సీ స్టడీ సర్కిళ్లను.. నామమాత్రంగా మార్చేసింది. పేద ఎస్సీ విద్యార్థులకు ప్రఖ్యాత శిక్షణ సంస్థల్లో ఉచితంగా సివిల్స్ శిక్షణ ఇచ్చే.. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికీ వైసీపీ సర్కార్ తిలోదకాలిచ్చింది.