తెదేపా (TDP) నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తే ఊరుకోబోమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు అన్నారు. పాలపాడు గ్రామంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఏర్పడిన వివాదంలో ఆరుగురు తెదేపా నాయకులను శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్టును వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు ఠాణా ఎదుట ఆందోళన చేశారు.
ఆందోళన చేస్తున్న చదలవాడ అరవింద బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. స్టేషన్ నుంచి బయటికు వచ్చిన అరవిందబాబు.. తెదేపా శ్రేణులతో పల్నాడు రోడ్డులోని ప్రధాన రహదారిపై మళ్లీ ఆందోళన చేసేందుకు బయలుదేరారు. వెంటనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కొంతసేపు ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చదలవాడను బలవంతంగా కారు ఎక్కించి ఆయన స్వగృహానికి పంపించారు.
నరసరావుపేట తెదేపా కార్యాలయం ఎదుట చదలవాడ అరవింద బాబు మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా (YSRCP) ప్రభుత్వం దుర్మార్గపు పరిపాలన చేస్తోందని విమర్శించారు. తెదేపా నాయకులను వైకాపా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అరెస్ట్లు చేయిస్తోందని ఆరోపించారు. నరసరావుపేట మండలం పాలపాడులో పెద్దల సమక్షంలో నాయకుల విగ్రహాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవాలో ఇరువర్గాలు ముందుగానే నిర్ణయం తీసుకున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివాదం సృష్టించేందుకే గ్రామంలో వద్దనుకున్న ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయించే ప్రక్రియ మొదలుపెట్టించారని వ్యాఖ్యానించారు.
ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న తెదేపా నాయకులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారని ఆరోపించారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు.. ఎమ్మెల్యే మాట విని తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. తెదేపా శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: