రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొవిడ్ ఆస్పత్రుల్లో 2,500 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత వీటిని ఐసీయూల్లో అమర్చనున్నారు. వైద్య సిబ్బందిలో అప్రమత్తను పెంచేందుకు సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అవసరమైతే వీటితో రోగులతోనూ నేరుగా మాట్లాడతారు.
కేంద్ర కారాగారంలో కరోనా కలకలం
ఓ రిమాండు ఖైదీకి కరోనా పాజిటివ్ తేలడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 16న కారాగారానికి వచ్చాడని జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
కోలుకున్న యువతికి మరోమారు పాజిటివ్
కరోనా నుంచి కోలుకున్న యువతికి మరోమారు వ్యాధి సోకింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన యువతికి గత నెల 24న పాజిటివ్ వచ్చింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయగా కోలుకున్నారు. బుధవారం మరోసారి నిర్వహించిన పరీక్షలలో పాజిటివ్ అని తేలింది.
తెలంగాణలో మరో 352 కేసులు
తెలంగాణలో గురువారం కొత్తగా 352 కేసులు నమోదవడంతో.. మొత్తం సంఖ్య 6027కు చేరింది. మరో ముగ్గురు మరణించగా.. మృత్యువాత పడ్డవారి సంఖ్య 195కు పెరిగింది. తమిళనాడులో గురువారం 2,141 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 52,334కి చేరింది. తాజాగా 49 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 625కి పెరిగింది. కర్ణాటకలో గురువారం ఒక్క రోజే 12 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసులు 7,944కు చేరాయి.
ఒకరి నుంచి 222 మందికి
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని జి.మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు వచ్చాయి. పెదపూడి మండలంలో 125, రాయవరం మండలం సూర్యారావుపేటలో 57, బిక్కవోలులో 20, మండపేటలో 10, రామచంద్రపురంలో 7, అనపర్తి మండలంలో 2, తునిలో ఒక కేసు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: