Capital farmers Padayatra: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు అరసవిల్లి పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాజధాని నుంచి పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదనను స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆమోదించారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా అదే రోజున పాదయాత్ర ప్రారంభించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. గతంలో తిరుమలకు పాదయాత్ర చేసినందున.. ఈసారి అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకూ పాదయాత్ర చేసినట్లు అవుతుందన్నారు. పాదయాత్ర విషయంలో సభకు హాజరైన వారంతా ఆమోదం తెలిపారు.
గతంలో ఐకాస కన్వీనర్‌గా ఉన్న పువ్వాడ సుధాకర్ పాదయాత్ర ప్రారంభం విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజుల సందర్భంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించటం బాగుంటుందని సూచించారు. హైకోర్టు తీర్పు అమరావతికి అనుకూలంగా వచ్చిన తర్వాత పాదయాత్ర చేసే విషయంలో కూడా సరైన ఆలోచన చేయాలన్నారు. పాదయాత్ర విషయంలో అందరూ సహకరించాలని సీనియర్ నాయకులు బెల్లంకొండ నరసింహరావు కోరారు. అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రైతులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పాటు.. లీగల్ కమిటీ, మహిళా ఐకాస, దళిత ఐకాస నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇవీ చదవండి: