గుంటూరు నగరపాలక సంస్థలో వాణిజ్య సముదాయ భవనాల్లో సెట్ బ్యాకుల కోసం వదిలిన స్థలాల్లోనూ తిరిగి కొందరు భవన యజమానులు నిర్మాణాలు చేపడుతున్నారు. అత్యంత ఖరీదైన బృందావన్‌గార్డెన్స్ ప్రాంతంలో ఓ వాణిజ్య కాంప్లెక్సులో సెట్‌బ్యాకుల కోసం విడిచిపెట్టిన స్థలంలో జీ+3 భవనం నిర్మించారు. ప్రమాదవశాత్తు ఆ కాంప్లెక్సులో ఏదైనా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే అగ్నిమాపక వాహనం అందులోకి ఎలా ప్రవేశిస్తుందో యంత్రాంగమే గుర్తెరగాలి. సెట్ బ్యాక్‌ల కోసం నిర్మాణం ముందు, వెనక భాగాల్లో కొంత స్థలాన్ని వదులుతారు. దానిలో ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు. అందుకు విరుద్ధంగా గార్డెన్స్ ప్రాంతంలో ఓ వాణిజ్య సముదాయంలో భవన నిర్మాణం చేపట్టడం గమనార్హం.
కమిషనర్ కంటపడటంతో ....
నగర కమిషనర్ తన క్షేత్ర పర్యటనల్లో భాగంగా ఈ అనధికారిక, అక్రమ భవనాన్ని గుర్తించారు. ఇన్నాళ్లు ఈ ప్రాంతంలో అధికారులు అడుగుమోపలేదా? ఒకవేళ మోపినా చూసీచూడనట్లు వెళ్లిపోయారా అనేది ప్రశ్నార్థకమవుతోంది. కొందరు కిందస్థాయి అధికారులు వ్యక్తిగత లబ్ధి చూసుకుని అనధికారిక నిర్మాణాలకు ఊతమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరండల్‌పేట నాలుగో రోడ్డులో నగరపాలక స్థలంలో కనీసం పార్కింగ్ లేకుండా నాలుగంతస్తుల నిర్మాణం ప్లానుకు విరుద్ధంగా చేపట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది.
హైకోర్టు నుంచి నోటీసులు
జీటీ రోడ్డులో ఐటీసీ భవనం వద్ద జరుగుతున్న ఓ గృహనిర్మాణంలో చాలా ఉల్లంఘనలు ఉన్నాయని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఏం చర్యలు తీసుకుంటారో ఆరు వారాల్లోపు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో యంత్రాంగం అప్రమత్తమై ప్రస్తుతం దాని నిర్మాణాన్ని నిలుపుదల చేయించారు. గార్డెన్స్, గుజ్జనగుళ్ల ప్రాంతంలో నాలుగు కట్టడాలు ప్లానుకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి ఆ ప్రాంత ప్రణాళికాధికారులకు ఈ మధ్య షోకాజ్ నోటీసులివ్వటం ప్రణాళిక విభాగంలో చర్చనీయాంశమవుతోంది.
సెట్ బ్యాక్ కోసం వదిలిన స్థలాన్ని గ్రీనరీగా అభివృద్ధి చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. షాపింగ్ కోసం వచ్చిన వారు అవసరమైతే కొద్దిసేపు సేద తీరేలా ఏర్పాట్లు ఉండాలే తప్ప మరే రకమై నిర్మాణాలు చేపట్టకూడదని ప్రణాళికవర్గాలే గుర్తు చేస్తున్నాయి. ఇవేవీ అమలు కావడం లేదు. గార్డెన్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణంపై ఆ ప్రాంత అధికారిని వివరణ కోరామని, దాని ఆధారణంగా చర్యలు ఉంటాయని సిటీప్లానర్ సత్యనారాయణ చెబుతున్నారు.
ఇదీ చూడండి. Jindal Steel and Power: జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు 860 ఎకరాల భూముల కేటాయింపు