BJP State President Purandeswari on AP Liquor: రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో (Liquor Business in AP) ప్రతి ఏటా 25 వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని.. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తిచేశారు. దిల్లీలో అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందించారు.
మద్యం వ్యాపారంలో భారీ అవినీతి జరుగుతోందని.. ఇక్కడ విక్రయిస్తున్న నాసిరకం మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సీఎం జగన్, అతని అనుచరుల జేబులు నింపడానికి వేల కోట్లు రూపాయలు దారిమళ్లిస్తున్నారన్నారు. మద్యం దుకాణాలను గతంలో టెండర్ ద్వారా అప్పగించేవారని.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తోందని వివరించారు.
New Liquor Policy in AP: మద్య నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ హామీని మరిచి..!
మద్యం తయారీ యూనిట్లన్నింటినీ బెదిరించి వైసీపీ నాయకులే స్వాధీనం చేసుకున్నారన్నారు. ఒక వైసీపీ ఎంపీ ఇదివరకు మద్యం సరఫరా చేసేవారని.. ఇతర వైసీపీ నాయకులతో చేతులు కలపడానికి ఆయన నిరాకరించడంతో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వారి కంపెనీ నుంచి మద్యం కొనడం పూర్తిగా మానేసిందని చెప్పారు. అధికారంలో ఉన్న నాయకులు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు.
మద్యం తయారీ విధానం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని పురందేశ్వరి వివరించారు. మద్యం తయారీకి ముడిసరకుగా ఉపయోగించే రెక్టిఫైడ్ స్పిరిట్‌లోని హానికరమైన పదార్థాలను తొలగించేందుకు మద్యం తయారీదారులు ఇదివరకు ఎన్నోసార్లు దాన్ని డిస్టిల్ చేసేవారన్నారు. ప్రస్తుతం డిస్టిలేషన్ ప్రక్రియనే అనుసరించడం లేదని, అందులో ఉన్న హానికారక పదార్థాలను తొలగించడంలేదని తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
లీటర్ మద్యం తయారీకి 15 రూపాయలు ఖర్చయితే, దాన్ని 600 నుంచి 800 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. పైగా 80 శాతం విక్రయాలను నగదు రూపంలోనే చేస్తున్నారని చెప్పారు. ఇటీవల ఓ మద్యం దుకాణాన్ని సందర్శించగా అక్కడ దుకాణదారు లక్ష విలువైన అమ్మకాలు చేయగా అందులో 700 మినహా మిగిలినదంతా నగదు రూపంలోనే ఉందని పురందేశ్వరి వివరించారు.
రాష్ట్రంలో రోజూ 80 లక్షలమంది మద్యం తాగుతున్నారన్నది సగటు కనీస లెక్కని.. వీరు ప్రతిరోజూ 200 రూపాయల మేర మద్యం కొనుగోలు చేసినట్లు భావించినా సగటున సంవత్సరానికి 57 వేల 600 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వార్షిక ఆదాయం 32 వేల కోట్లుగానే చూపుతోందన.. దీన్నిబట్టి ఏటా కనీసం 25వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కూడా ఆర్థికంగా సంతృప్తి పరిచిన కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేస్తోందని పురందేశ్వరి హోమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలా చేసిన అక్రమార్జనంతా రాష్ట్రంలో ఉన్నతస్థాయిలో కూర్చున్నవారికి నేరుగా చేరుతున్నట్లు ఆరోపించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మద్యంపై వసూలు చేస్తున్న స్పెషల్ డ్యూటీ రాష్ట్ర ఖజానాకు చేరడంలేదని అది ఎక్కడికిపోతోందన్నది ప్రశ్నార్థకమన్నారు.
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో వారిపై ఆధారపడిన వేలమంది రోడ్డునపడుతున్నారన్నారు. ఇన్ని పేద కుటుంబాలు అతలాకుతలం కావడానికి సీఎం జగన్, అతని వందిమాగధులే ప్రధాన కారణమని చెప్పారు. వ్యక్తిగతంగా ఆసుపత్రులను సందర్శించి అక్కడి డాక్టర్లతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో లివర్ సిరోసిస్, ప్రాంక్రియాటిస్‌తో సంభవించే మరణాల సంఖ్య 25 శాతం పెరిగినట్లు తేలిందని ఆందోళన వ్యక్తం చేశారు.
AP BJP Chief Purandeswari Comments: మద్యం అవినీతిలో కర్త, కర్మ, క్రియ వైసీపీ ప్రభుత్వమే: పురందేశ్వరి
ఇందుకు ప్రధాన కారణం నాసిరకం మద్యం వినియోగమేనన్నారు. రాష్ట్రంలో యథేచ్చగా సాగుతోన్న అవినీతి అమాయకుల ప్రాణాలను బలిగొంటోందని.. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ఉన్న హానికారక పదార్థాలకు సంబంధించిన నివేదికనూ వినతిపత్రానికి జతచేశారు. ఈ మొత్తం వ్యవహారాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిత్ షాకు పురందేశ్వరి వివరించారు.