APSRTC Employees Union President passes away: ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. వైవీ రావు మృతి పట్ల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు, ఇతర నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
వైవీ రావు మృతి ఎంతో బాధాకరమని ఆర్టీసీ ఎన్ఎంయూ, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, ఇతర సంఘాల నేతలు, ఆర్టీసీ అధికారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. వైవీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.
కాగా ఈ మధ్యనే ఆయన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఓ చర్చలో పాల్గొన్నారు. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేయడం వలన ఎటువంటి సమస్యలు ప్రస్తుతం వస్తున్నాయో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల సమస్యలపై మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా.. ఉద్యోగులు సంతోషంగా లేరని.. ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు.
ఆర్టీసీలో కొత్తగా నియామకాలు కూడా చేపట్టలేదని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత.. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని వాటిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని కోరారు. ఎన్నో ఆర్థిక పరమైన అంశాలు గురించి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని.. వీటన్నింటి గురించీ ఓ సారి గౌరవ ముుఖ్యమంత్రి గారు ఆలోచించాలని అన్నారు.
ఇలా ఎన్నోసార్లు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు.. తన వంతు కృషి చేశారు. ఆయన హఠాత్తుగా మరణించడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైవీ రావు మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర నేతలు, ఆయన సన్నిహితులు.. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇవీ చదవండి: