AP Finance Department New Budget Proposals: మాజీ సీఎస్ నీలం సాహ్ని, మాజీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తోపాటు తాజాగా పదవీవిరమణ చేసిన మాజీ సీఎస్ సమీర్‌శర్మకు..రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఉన్నత పదవులు కట్టబెట్టింది. రాజకీయ అవసరాల కోసం రోజుకొక సలహాదారు పోస్టులు సృష్టిస్తూ కేబినెట్ హోదాతో నచ్చిన వారికి అందలమెక్కిస్తోంది. వీరికి లక్షల్లో జీతాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చిపెట్టింది. అదేసమయంలో చిరుద్యోగులను ఏరివేయాలని, పొరుగు సేవల సిబ్బందిని తగ్గించుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసే క్రమంలో ఖర్చు తగ్గించుకోవాలంటూ అన్ని ప్రభుత్వశాఖలకు ప్రభుత్వం సుద్దులు చెబుతోంది. కొత్తగా సహాయ సిబ్బంది కావాలంటూ ఏ ప్రభుత్వశాఖ ప్రతిపాదనలు పంపొద్దని సూచించింది.
2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడటంతో ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ ప్రతిపాదనలపై అనేక ఆంక్షలు విధించింది. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి..ఎక్కడెక్కడ ఎలా కోత పెట్టాలో పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది. పొరుగు సేవల సిబ్బందికి, ఒప్పంద ఉద్యోగులకు జీతాలు చెల్లించే క్రమంలో ‘300-అదర్ కాంట్రాక్ట్యువల్ సర్వీసెస్’ అనే హెడ్ కింద ప్రతిపాదనలను పంపుతున్నారు. వీరి జీతాలకు బడ్జెట్‌లో ప్రొవిజన్ చూపే సమయంలో సంబంధిత విభాగాధిపతి వారిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అందులో ప్రస్తావించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వంలో ఇకపై కొత్త వాహనాల కొనుగోళ్లపైనా నిషేధం విధించారు. కొత్త బడ్జెట్‌లో వీటి కోసం ఎలాంటి ప్రతిపాదనలు ఉండకూడదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ శాఖలకే వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించింది.
అనేక ప్రభుత్వశాఖలు బడ్జెట్ అంచనాలను సరిగా పాటించడం లేదని..ప్రతిపాదనలకు, అసలు ఖర్చులకు మధ్య పొంతన ఉండటం లేదన్న ఆర్థిక శాఖ..నిజానికి ఎంత నిధి అవసరమో అంచనా వేయలేకపోతున్నాయని..ఆడిట్ అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నందున వాస్తవాలకు దగ్గరగా ఉండే ప్రతిపాదనలే సమర్పించాలని కోరింది. ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకునేందుకు స్పష్టమైన ఉత్తర్వులుంటేనే వాటి చెల్లింపులకు ప్రతిపాదనలివ్వాలని..ప్రభుత్వం నుంచి నిర్ధిష్టంగా ఇందుకు మంజూరు లేకపోతే వాటికి చెల్లింపులు చేయడానికి వీల్లేదని తెలిపింది.
ఒకే తరహా పథకాలు ఒకటికి మించి ఉంటే వాటిని సమ్మిళితం చేయాలని..ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న తరహా పథకాలు రాష్ట్రంలో కొత్తగా ఏవీ ప్రారంభించకుండా చూడాలని కోరింది. కొత్తగా కన్సల్టెంట్లను నియమించుకోవద్దని..విశ్రాంత ఉద్యోగులను మళ్లీ ఉద్యోగంలో చేర్చుకునే విషయాన్ని బాగా తగ్గించుకోవాలని కోరింది. పొరుగు సేవల సిబ్బందిని వీలైనంతగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని..ఎంతవరకు అవసరమో క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్థికశాఖ సూచించింది’. ఆయా ప్రభుత్వశాఖలు పంపిన బడ్జెట్ ప్రతిపాదనలను సచివాలయంలోని పాలనా విభాగాధిపతులు పరిశీలించి వారి అభిప్రాయాలను జత చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: