ఉచిత విద్యుత్‌ను తీసేందుకే ప్రభుత్వం నగదు బదిలీ పేరుతో కుట్రకు తెరలేపిందని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ వల్ల రైతులకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం శూన్యమన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వమే డిస్కంలకు వ్యవసాయ విద్యుత్ బిల్లులు చెల్లిస్తోందని, ఇప్పుడు నగదు బదిలీ పేరుతో ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుని రైతుల నెత్తిపై భారం మోపుతోందని విమర్శించారు. ఇది విద్యుత్ నగదు బదిలీ కాదు, ప్రభుత్వ బాధ్యత బదిలీ అని ఆరోపించారు. ఈ విధానం తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక స్థితి నేపథ్యంలో ఉద్యోగులకు, జీతాలు, వృద్దులకు పింఛన్లే సకాలానికి ఇచ్చే పరిస్థితి లేదని, అలాంటప్పుడు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం విద్యుత్ బిల్లులు ఎలా జమ చేస్తుందన్నారు. ప్రభుత్వం సకాలానికి రైతు ఖాతాల్లో డబ్బులు జమచేయకపోతే డిస్కంలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే అప్పుడు రైతుల పరిస్థితి ఏంటన్నారు. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపడంలో విఫలమై రైతులపై భారం వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం రైతులను వంచించడమేనని అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ