Amaravati farmers: రాజధాని ప్రాంతంలోని ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలివిడతలోని 1,140 ఎకరాల్లో లే ఔట్ల అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి. దొండపాడు, నెక్కల్లు ప్రాంతాల్లో కేటాయించిన 260 ఎకరాలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. రైతుల ఆందోళనలతో రెండు రోజులు ఆగిన పనుల్ని సీఆర్డీఏ అధికారులు తిరిగి ప్రారంభించారు. జేసీబీలు, ప్రొక్లెయినర్లు మొహరించి రెవిన్యూ, సర్వే సిబ్బందితో లేఔట్లను సిద్ధం చేస్తున్నారు.
రైతులు మళ్లీ ఆందోళనలు చేయకుండా పోలీసుల్ని మోహరించారు. ఈ నెల 18వ తేదీలోగా లేఔట్లు సిద్ధం చేసి.. ఆ తర్వాత సీఎం చేతుల మీదుగా ప్లాట్ల పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకూ ఆర్ 5 జోన్ అభివృద్ధి పనులు, ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ నిలిపివేయాలని రాజధాని రైతులు, ఐకాస నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతోపాటు అమరావతి బృహత్ ప్రణాళిక విచ్ఛిన్నం చేసేందుకే ఆర్ 5 జోన్ తెచ్చారని రైతులు వాపోతున్నారు.
రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయకుండానే, పేదలకు ఇళ్ల స్థలాలంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు 326ఏ జోడించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడాన్ని తప్పు పట్టారు. మంగళగిరి కోర్టు తీర్పును స్వాగతించిన అన్నదాతలు.. తమ వైపు ఉన్న ధర్మమే.. సుప్రీంకోర్టులో న్యాయం జరిగేలా చూస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ 5 జోన్ రద్దు చేయాలంటూ కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చేవరకు దీక్షలు కొనసాగించాలని ఐకాస నేతలు నిర్ణయించారు.
"గతంలో కమిషనర్ చెప్పినట్టుగానే.. తీర్పు వచ్చేంతవరకు ప్రభుత్వం కూడా దానిగి అనుగుణంగా ఉండాలని కోరుతున్నాము. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎక్కడి పనులు అక్కడే నిలుపుదల చేయాలని కమీషనర్ అధికారిని, ప్రభుత్వాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతున్నాము." - పువ్వాడ సుధాకర్, రాజధాని ఐకాస సమన్వయ కమిటీ నేత
"మేము భూములు ఇచ్చి.. ఈ రోజు రోడ్డున పడ్డాము. కోర్టు తీర్పుల కోసం మా ఆడవాళ్లందరితో పాటు మమ్మల్ని రోడ్డున పడేశారు. 1200 రోజులుగా మమ్మల్ని ఇలా హించిస్తున్నారు. న్యాయం కోసం మేము ఎన్నాళ్లైనా ఎదురు చూస్తాము." - రాజధాని రైతు
ఇవీ చదవండి: