TDP Leaders Fires on CM Jagan: పోలవరం ప్రాజెక్టుకు ఓ శనిగ్రహంలా, గుదిబండలా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డిని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ నిలదీయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు సూచించారు. జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకునే విధంగా పీపీఏ ముందుకెళ్లాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి పోలవరం ప్రాజెక్టు మొత్తం బలైపోయిందని ఆగ్రం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు. నిపుణుల బృందం అధ్యయనంపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల గోదావరి జలాల స్థిరీకరణ మొత్తం దెబ్బతిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్న విజనరీ చంద్రబాబు అయితే.. ప్రాజెక్టును దెబ్బతీసి రాష్ట్రానికి తాగు, సాగు నీరు లేకుండా చేసిన ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు.
అప్పుడైనా.. ఇప్పుడైనా రెడీ.. మీరు సిద్ధమా: రాష్ట్ర ఆర్ధికస్థితిపై సీఎం బహిరంగ చర్చకు వస్తే.. తాము సిద్ధమని గతంలోనే చెప్పామని.. ఇప్పటికి కూడా దానికి కట్టుబడే ఉన్నట్లు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాకుండా.. దమ్ముంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల రాకతో ఆదాయం సమకూరితే, ప్రస్తుతం అప్పులపైనే ఆధారపడిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. నాడు విభజన సమస్యలు వెంటాడుతున్నప్పటికీ ఐదేళ్లలో చేసిన అప్పు 1.86 లక్షల కోట్లు మాత్రమే అని తెలిపారు. నేడు జగన్ రెడ్డి నాలుగేళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. రోజూ ఆర్బీఐ ముందు అప్పుల కోసం మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల ఆదాయం 200 రెట్లు పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రజల ఆదాయం మాత్రం తరుగుతూ ఉందని విమర్శించారు.
20 నుంచి భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర: విశాఖను అరాచక శక్తులకు అడ్డాగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఏలూరు టీడీపీ కార్యాలయంలో సమావేశమైన ఆయన.. ఓ ఎంపీ కుటుంబాన్ని కూడా రక్షించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు ఒక్కరోజు కూడా పదవిలో ఉండేందుకు అర్హత లేదన్న ఆయన.. ప్రభుత్వానికి దమ్ముంటే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను తామే ఇచ్చినట్లు చెప్పుకుంటున్న జగన్.. అవి టీడీపీ హయాంలోనే 90శాతం పూర్తైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 20 నుంచి భవిష్యత్ గ్యారెంటీ ప్రచార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రత్తిపాటి వెల్లడించారు. జోన్-2 పరిధిలో బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై నియోజకవర్గాల ఇంఛార్జిలతో సమావేశమైన ఆయన.. ఈ నెల 20న ఉంగుటూరు, 21న ఏలూరు, 22న దెందులూరు, 23న నూజివీడు, 24న పోలవరంలో భవిష్యత్ గ్యారెంటీ ప్రచార బస్సు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు: బాబాయ్‌ని గొడ్డలి వేటుకు బలి చేసిన జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ధ్వజమెత్తారు. పట్టపగలే విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలబెట్టారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్పై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని దుయ్యబట్టారు.