Union Minister of State for Home Affairs comments: ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం, స్థాయి పెంపుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించటం లేదని.. కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు తెలిపింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్.. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం, పురోగతికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. వాటికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణానికి, వాటి పురోగతికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. ఆ రాష్ట్ర నుంచి ఇప్పటివరకూ సరైన సమాచారం అందడం లేదని పేర్కొన్నారు. ఏపీలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం.. 2017-18, 2018-19 సంవత్సరాల్లో 42.35 కోట్ల రూపాయలు, 2021-21లో 28.75 కోట్లు, 2022-23లో 37.40 కోట్లు, 2023-24లో 43.50 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.
అనంతరం 2020 నవంబరు నుంచి 14.36 కోట్ల రూపాయలకు సంబంధించిన యూసీలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని.. అందువల్లే ఈ ఏడాది నిధులను కేటాయించడం గానీ, నిధులను విడుదల చేయడం గానీ చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ల్యాబ్‌ల నిర్మాణ వేగవంతంపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులకు ఎప్పటికప్పుడు లేఖలు రాయడంతో పాటు.. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి నిత్యానందరాయ్ సమాధానంలో వివరించారు. ఇటీవలే ఎఫ్ఎస్ఎల్ నిర్మాణ పురోగతిపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు.
ఇవీ చదవండి