Most Road Accident On National Highway 16 : ఇది చెన్నై నుంచి కోల్కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి. మొన్నటి వరకు ఈ జాతీయ రహదారి కేవలం నాలుగు వరుసలుగా ఉండేది. ఇటీవలె దీనిని ఆరు వరుసల రహదారిగా విస్తరించారు. రహదారిని విస్తరించడమే ఏలూరు జిల్లా దెందులూరు మండలం శింగవరం పరిధిలోని కొమిరేపల్లి గ్రామస్థులకు శాపంగా మారింది.
ఏలూరు నుంచి గుండుగొలను వెళ్లే మార్గంలో ఈ గ్రామం ఉంటుంది. సాధారణంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాలలోకి ప్రవేశించేందుకు వీలుగా అండర్ పాస్లు నిర్మించడం సహజం. ఐతే ఇక్కడ మాత్రం రహదారి విస్తరణలో భాగంగా అండర్ పాస్ ఇవ్వకపోగా గతంలో రోడ్డు దాటేందుకు వీలుగా ఉన్న ఖాళీని సైతం తొలగించడంతో గ్రామస్థులు తమ గ్రామానికి వెళ్లేందుకు జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో రావాల్సి వస్తోంది.
రెండు నెలల్లో ఐదు ప్రమాదాలు : కొమిరేపల్లి గ్రామస్థులు నిత్యం విద్య, వైద్యం, జీవనోపాధి, నిత్యావసరాలు ఇలా పని ఏదైనా జాతీయ రహదారికి అవతలి వైపునున్న గుండగొలను వెళ్లాల్సిందే. గ్రామం నుంచి బయటకు వెళ్లేప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా తిరిగి వచ్చేప్పుడు మాత్రం గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటునే రాకపోకలు సాగిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఇలా రోడ్డు దాటుతూ గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
అధికారులపై గ్రామస్థుల ఆవేదన : రోడ్డు ప్రమాదంలో ఇంటిలోని పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోలానే తమ గ్రామం వద్ద వంతెన నిర్మిస్తే ప్రమాదాలు జరగవని గ్రామస్థులు చెబుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే, ఆర్అండ్బీ అధికారులు, ఎన్హెచ్ఏఐ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అయినా నేటికి ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదని అధికారుల తీరుపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ రహదారిపై వంతెన నిర్మాణం : పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రమాదాల బారిన పడతారనే భయంతో హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ గ్రామానికి క్షేమంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా జాతీయ రహదారిపై వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
'గడిచిన రెండు నెలల్లో ఈ రహదారిపైన ఐదు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కిడ మృతి చెందారు. మాకు రహదారిపైకి రావాలంటేనే భయంగా ఉంది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వచ్చి రోడ్డును పరిశీలించారు. అలా పరిశీలించి వెళ్లకుండా మాకు వంతెన నిర్మించి మా అందరి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాము.'- కొమిరేపల్లి గ్రామస్థులు