LOCK TO UNION BANK: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని యూనియన్ బ్యాంకు వద్ద రైతుల ఆందోళన చేస్తున్నారు. పంట రుణాల జమలో అవకతవకలపై న్యాయం చేయాలంటూ బ్యాంకుకు తాళం వేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకు, పోలీస్, రెవెన్యూ అధికారుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులు వచ్చి న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు స్పష్టం చేశారు. బ్యాంకుకు తాళాలు వేయడంతో సేవలు అందక ఖాతాదారులకు ఇబ్బందులు పడుతున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం యూనియన్ బ్యాంకులో.. రైతుల పంట రుణాల జమలో అవకతవకలు వెలుగు చూసి దాదాపు రెండు నెలల గడుస్తోంది. న్యాయం చేస్తామని మాట మినహా వారి నుంచి ఏ విధమైన భరోసా రైతులకు లభించలేదు. ఈ నేపథ్యంలో మరోమారు బాధిత రైతులు ఆందోళనకు దిగారు. బ్యాంకుకు గత కొద్ది రోజులుగా రైతులు తాళాలు వేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో సేవలు కోసం వచ్చిన ఖాతాదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికే ప్రభుత్వం అమ్మఒడి తదితర పథకాలకు సంబంధించిన నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. అయితే.. రైతుల ఆందోళన కారణంగా వాటిని తీసుకునే వీలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. పాత రుణాలు రీ-షెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇస్తారని ఉన్న బకాయిలు చెల్లించాం. పాత రుణాలు జమ కాక.. కొత్త రుణాలు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. చేతిలో చిల్లిగవ్వ లేదు. సాగు అదును దాటిపోతోంది. మాకు పురుగుల మందే శరణ్యం. ఇప్పటికే దాదాపు జిల్లాస్థాయి ఉన్నతాధికారులను సంప్రదించి మా సమస్యలు వివరించాం. వాళ్లనుంచి ఎలాంటి స్పందన లేకనే ఆందోళన చేస్తున్నాం. అధికారులు వచ్చి సమస్యలను పరిష్కరించే వరకు మా ఆందోళన కొనసాగిస్తాం. -బాధిత రైతులు
ఇవీ చదవండి: