వైకాపా ప్రభుత్వం కరోనా కేసులను తగ్గించి చూపేందుకు అంకెల గారడీ చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వ ప్రకటనలున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మార్చి 14న ఒక కేసు ఉంటే, ఏప్రిల్ 26కు 1016 కేసులకు చేరినట్లుగా ప్రభుత్వ లెక్కలే చెప్పాయని, నెలలోనే కరోనా కేసులు 101% పెరిగాయన్నారు. దక్షిణాదిలోనే రెండో గరిష్ట కేసులున్న రాష్ట్రంగా ఏపీ మారిందన్నారు. ఇదే వేగంతో విస్తరిస్తే మే 3కల్లా కేసులు 2వేలకు చేరతాయని అనడంలో సందేహం లేదన్నారు.
కేంద్ర బృందానికి ఫిర్యాదు
రాష్ట్రానికి రానున్న కేంద్ర అధికారుల బృందానికి... కేసులు కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా విఫలం అయ్యిందో వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తామని యనమల చెప్పారు. అత్యధికంగా కరోనా పరీక్షలు చేశామని చెబుతున్నారే తప్ప, పాజిటివ్ కేసులు అత్యధికంగా పెరిగాయని చెప్పడం లేదన్నారు. పరీక్షలు చేయకుండానే చేసినట్లు చూపి, ఇన్ఫెక్షన్ రేటు 1.66 శాతం తగ్గించి చూపడానికే పరీక్షలు ఎక్కువ చేశామని చెబుతున్నారన్నారని ఆరోపించారు. పాజిటివ్ కేసులు వందశాతం పెరిగితే, ఇన్ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుందన్నారు. ఈ రివర్స్ లెక్కలేంటో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులే వైరస్ వ్యాప్తికి కారకులు అయ్యారని యనమల విమర్శించారు.
ఇదీ చదవండి: