మూడు ముళ్ల బంధానికి మూడు పదులు దాటాయి.. పిల్లలు లేకున్నా దంపతులిద్దరూ సంతోషంగానే జీవిస్తున్నారు. కానీ వారిని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. దీంతోనే వారిద్దరూ తనువు చాలించారు. అయితే భర్త చనిపోయిన గంట వ్యవధిలోనే ఆమె కూడా ప్రాణాలు విడిచి.. మరణంలోనూ తమ బంధం వేరు కాదని నిరూపించారు.
భర్త మరణించిన గంట వ్యవధిలోనే భార్య ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దంపతులు త్రిమూర్తులు, రామలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే భార్య కాలు విరిగి మంచానికి పరిమితమైంది. దీంతో వారిద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. త్రిమూర్తులు తన భార్యకు అల్పాహారం తీసుకువచ్చేందుకు బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు గమనించి ఇంటికి తీసుకు వచ్చేసరికి ప్రాణాలు విడిచారు. ఆయన మృతదేహంపై పడి బోరున విలపిస్తూ రామలక్ష్మి కూడా మృతి చెందింది. భర్త మృతి చెందిన గంట వ్యవధిలోనే ఆమె మృతి చెందడంతో అందరినీ కంటతడి పెట్టించింది. పిల్లలు లేకపోవడంతో బంధువులే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎంతో అన్యోన్యంగా బతికిన ఆ దంపతులు.. చావులోనూ వారి బంధం వీడలేదని పలువురంటున్నారు.
ఇదీ చదవండి: TWO DEAD: కరపలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి