తూర్పు గోదావరి జిల్లా రాజోలు జెడ్ కూడలిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ దుకాణంలో ఫిబ్రవరి 8న తుపాకీతో బెదిరించి.. చోరీకి ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ దుర్గా శేఖర్ రెడ్డి వెల్లడించారు. అయినవిల్లి మండలం వెలువల్లపల్లి గ్రామానికి చెందిన బొక్కా వెంకటేశ్వరరావు, రావులపాలెం మండలం దేవరపల్లికి చెందిన పితాని దుర్గ, శివ ఇద్దరూ జల్సాలకు బానిసలై అప్పులు చేశారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో చోరీ చేసి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకొన్నారు. గత నెల 8న చోరీ చేయడానికి రాజోలులోని జ్యూయలరీ దుకాణం ఎంచుకొని.. ఉదయం ఒకసారి దుకాణం వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ద్విచక్రవాహనంపై దుకాణానికి వచ్చి డమ్మీ తుపాకీతో యజమానిని బెదిరించి చోరీకి యత్నించారు.
ప్రయత్నం విఫలం అవటంతో అక్కడినుంచి పారిపోయారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ బి కృష్ణమాచారి ప్రత్యేక బృందాలతో గాలించి.. నిందితుల ఆచూకీ తెలుసుకున్నారు. అయినవిల్లిలో దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నేరానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు. నిందితులు చోరీకి ఉపయోగించిన డమ్మీ తుపాకీ, హోండా యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దుకాణంలో నిందితులు వదిలేసిన చరవాణి ఆయా కూడళ్ళలో సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. రాజోలు పరిధిలో ఉన్న దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి...: 18 నెలల చిన్నారిపై అత్యాచారయత్నం నిందితుడు అరెస్ట్