తూర్పుగోదావరి జిల్లా తునిలోని రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలది ఘనమైన చరిత్ర. 1904లో తుని రాజు రాజా వెంకట సింహాద్రి జగపతి రాజు బహదూర్ ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే వాస్తు, సంప్రదాయాలను పాటిస్తూ 35 పెద్ద పెద్ద గదులతో సువిశాల ప్రాంగణంలో ఆంగ్ల అక్షరం 'T' ఆకారంలో దీనిని నిర్మించారు. స్వతంత్ర సంగ్రామంలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాలుగో తరగతి ఈ పాఠశాలలోనే చదివారు. ఆయన బడిలో చేరిన తేది, ఇతర వివరాలు ఇప్పటికీ రిజిష్టర్‌లో పదిలంగా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న పూర్వవిద్యార్థుల ఫోటోలు, వివరాలను జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.
క్షణక్షణం భయం భయం
1969లో ఈ భవనంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభమైంది. ఇక్కడ చదివిన అనేకమంది దేశవిదేశాల్లో ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇలా ఎంతోమందిని గొప్పవారిగా తీర్చిదిద్దిన ఈ కట్టడం నేడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. భవనం పైకప్పు, స్తంభాలు బీటలు వారి పెచ్చులూడుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా నీరు గదుల్లో వస్తోంది. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాఠశాల, కళాశాలలో చదువుతున్న వెయ్యిమంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. భవనం దుస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, వారి చర్యల కోసం ఎదురుచూస్తున్నామని కళాశాల ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.
పూర్వవిద్యార్థులు అందిస్తున్న సాయం ఈ కళాశాలకు గత వైభవం తీసుకొచ్చేందుకు సరిపోవటం లేదు. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే ఇది అసాధ్యమేమీ కాదని విద్యార్థులు, సిబ్బంది చెబుతున్నారు.